- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిహద్దులో ‘తమిళ’ ఎన్నికల కష్టాలు!
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగ లాంటివి. కానీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో నివసించే ప్రజలకు మాత్రం ఈ ఎన్నికల కాలం ఒక 'ఉక్కుపాదం'లా మారింది.

దిశ, చిత్తూరు ప్రతినిధి: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగ లాంటివి. కానీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో నివసించే ప్రజలకు మాత్రం ఈ ఎన్నికల కాలం ఒక 'ఉక్కుపాదం'లా మారింది. తమిళనాడులో ఎన్నికల నగారా మోగడంతో అమలులోకి వచ్చిన ఎన్నికల నియమావళి, సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లోని సామాన్య ప్రజల నిత్య జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఒకప్పుడు స్వేచ్ఛగా సాగిన రాకపోకలు, వ్యాపారాలు, కుటుంబ సంబంధాలు ఇప్పుడు తనిఖీలు, నిఘా నీడలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఆంక్షల వలయంలో అనుబంధాలు..
చిత్తూరు, తిరుపతి జిల్లాలకు తమిళనాడులోని వెల్లూరు, తిరువళ్లూరు జిల్లాలతో విడదీయలేని సంబంధం ఉంది. చిత్తూరు, పలమనేరు, సూళ్లూరుపేట, నగరి, పుత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల ప్రజలు తమ నిత్య అవసరాల కోసం, వ్యాపారాల కోసం కృష్ణగిరి, వాణియంబాడి, వెల్లూరు, కాంచీపురం, ఆరక్కోణం వంటి తమిళనాడు పట్టణాలపై ఆధారపడుతుంటారు. ఈ ప్రాంతాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 24 గంటల పాటు నిర్వహిస్తున్న తనిఖీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
నగదు నిబంధనలు.. సామాన్యుల తిప్పలు
ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తప్పనిసరిగా సరైన ఆధార పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలకు బట్టలు, బంగారం కొనుగోలు చేయాలంటే చెన్నై లేదా కాంచీపురం వెళ్లడం ఆనవాయితీ. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగదు తీసుకువెళ్తున్న వారు అధికారుల తనిఖీలకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటివరకు సరిహద్దుల్లో సుమారు రూ. 2.34 కోట్లకు పైగా నగదును అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. రోజుకు సగటున 15 నుంచి 20 కేసులు నమోదవుతుండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమ సొంత అవసరాల కోసం తీసుకెళ్లే డబ్బుకు కూడా వివరణ ఇచ్చుకోలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా..
కేవలం రోడ్లపై తనిఖీలే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లోని బ్యాంక్ లావాదేవీలపై కూడా అధికారులు నిశితంగా నిఘా ఉంచారు. ఏటీఎంల నుంచి భారీగా నగదు ఉపసంహరించిన, అకౌంట్లలో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసినా విచారణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. నగదుతో పాటు బంగారం, మద్యం, వెండి, గిఫ్ట్ ప్యాకెట్ల వంటి వాటిపై కూడా డేగ కన్ను ఉంది. నగదు ఒకసారి సీజ్ అయితే, దానిని తిరిగి పొందడానికి ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాల్సి రావడం, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం మధ్యతరగతి వర్గాలకు పెద్ద భారంగా మారింది.
రెండు రాష్ట్రాల ఓటర్ల పరిస్థితి విచిత్రం..
సరిహద్దుల్లో మరో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రంలో ఆధార్ కార్డ్ ఉండి, మరో రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. గతంలో మధ్యవర్తుల ద్వారా డబ్బులు పంపిణీ చేసి ఓట్లను ప్రభావితం చేసే ఘటనలు జరిగేవి. దీన్ని అరికట్టేందుకు ఈసారి తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, నిత్య అవసరాలైన ఇసుక, పెట్రోలు, డీజిల్ వంటి వాటి కోసం సరిహద్దు దాటే వారు కూడా గంటల తరబడి తనిఖీ కేంద్రాల వద్ద వేచి చూడాల్సి వస్తోంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రజలు అనవసర ఇబ్బందులకు గురికాకుండా ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వ్యాపారులు, రైతులు, కాంట్రాక్టర్లు తమ లావాదేవీలకు సంబంధించిన బిల్లులను, బ్యాంక్ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలకు సహకరిస్తే త్వరగా ప్రయాణం సాగుతుందని, అనుమానాస్పద వస్తువులు, మద్యం రవాణాకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల పారదర్శకత కోసం ఆంక్షలు అవసరమే అయినప్పటికీ, సామాన్య ప్రజల నిత్య జీవితం, అత్యవసర వైద్య సేవలు, శుభకార్యాలకు వెళ్లే వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కొంత మానవీయ కోణంలో వ్యవహరించాలని సరిహద్దు వాసులు కోరుతున్నారు. ఈ అసాధారణ పరిస్థితుల వల్ల అటు వ్యాపారాలు దెబ్బతినడమే కాకుండా, ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ 'సరిహద్దు కష్టాలు' తప్పేలా లేవు.






