- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Fact Check : తిరుమల క్యూలైన్‌లో పాముకాటు? అసలు నిజం ఇదీ!
కలియుగ వైకుంఠం తిరుమల క్యూలైన్‌లో ఓ భక్తురాలు పాముకాటుకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కలియుగ వైకుంఠం తిరుమల క్యూలైన్‌లో ఓ భక్తురాలు పాముకాటుకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ (AP Fact Check) విభాగం కూడా స్పందిస్తూ అసలు ఏం జరిగిందో వివరిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చింది. అధికారిక వివరణ ప్రకారం.. వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి శ్రీవారి దర్శనం కోసం టాక్సీలో తిరుమలకు చేరుకున్నారు. ఎస్వీ మ్యూజియం సమీపంలోని ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియా వద్ద కారు దిగిన మౌనిక, తన కాలికి పసుపు రాసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కాలికి ఏదో తగలడంతో ఆమె భయంతో కేకలు వేశారు. భర్త శరత్ బాబు అక్కడ వెతకగా ఒక చిన్న పాము పిల్ల కనిపించింది.
వైద్య పరీక్షల్లో తేలిందిదే..
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు పాముకాటు వేయలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. అయినప్పటికీ, భక్తురాలి ఆరోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్తగా తిరుపతిలోని స్విమ్స్ (SVIMS) ఆస్పత్రికి తరలించారు. స్విమ్స్ వైద్యులు సైతం ఆమెను నిశితంగా పరిశీలించి, అది పాముకాటు కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, అక్కడ కనిపించిన పాము విషపూరితమైనది కాదని కూడా నిర్ధారణ అయ్యింది.
దర్శనం చేసుకున్న భక్తులు..
టీటీడీ సిబ్బంది, వైద్యులు స్పందించిన తీరు పట్ల ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం వారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో పాముకాటు అంటూ జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమే. కాబట్టి కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మకండని ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.






