ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. గ్రేటర్ గా మారనున్న తిరుపతి

by Thanuru Gopichand |   (  Updated:2025-10-25 08:49:45  IST  )

తిరుపతి పేరు వినగానే గుర్తొచ్చేది తిరుమల (Tirumala) వెంకటేశుడే.

ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. గ్రేటర్ గా మారనున్న తిరుపతి
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి పేరు వినగానే గుర్తొచ్చేది తిరుమల (Tirumala) వెంకటేశుడే. గోవిందుని నామ స్మరణతో తిరుపతిలోని తిరుమల కొండలు అనునిత్యం మారుమ్రోగిపోతుంటాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నిత్యం లక్షలాది మంది తిరుపతి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలతో పాటు తిరుపతిలో బస చేస్తారు. కేవలం తిరుమలేశుడినే కాకుండా చుట్టూ ఉన్న ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ఇలా ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, పర్యాటకంగా ఎంతో ప్రాశస్త్యం పొందిన తిరుపతి నగరం మరింత విస్తరించనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తిరుపతి నగరపాలక సంస్థ పాలక మండలి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం 30.17 చదరపు కిలో మీటర్లు ఉన్న తిరుపతి నగరం కాస్త సుమారు 300ల చదరపు కిలో మీటర్లకు విస్తరించనుంది.

వివరాల్లోకి వెళ్తే తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా (Greater Tirupati) విస్తరించాలని ఎంతో కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అవి ఆచరణలోకి రావడానికి సమయం పట్టింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విషయమై తిరుపతి నగర పాలక సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించింది. గ్రేటర్ తిరుపతిలో తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి మండలాల్లోని 63 గ్రామ పంచాయితీలను విలీనం చేయాలనే ప్రతిపాదనలను ఆమోదించింది. అయితే ప్రభుత్వ ఆమోదం తరువాతే గ్రేటర్ తిరుపతి ఏర్పడనుంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో ప్రతిపాదనల ఆమోదం లాంఛనమే అనే అభిప్రాయం వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) తిరుపతిలో పర్యటించారు. ఆ సందర్భంలో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు విస్తరణ అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం 108 అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించగా అది కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందింది. ఒకవేళ ప్రభుత్వం ప్రతిపాదనలను ఆమోదిస్తే కేవలం నగర విస్తరణ పెరగడమే కాకుండా గ్రేటర్ తిరుపతిలో భాగమయ్యే ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి పథంలో పరుగులు పెడతాయనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

Next Story