ముఖ్యమంత్రి వందేళ్లకు ప్రణాళికలను రూపొందిస్తారు : ఎమ్మెల్యే

by Thanuru Gopichand |

సాధారణ ప్రజలు ఐదేళ్లు.. పదేళ్లకు ప్రణాళికలు రూపొందిస్తారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందేళ్లకు కావాల్సిన ప్రణాళికలను రూపొందిస్తారు.

ముఖ్యమంత్రి వందేళ్లకు ప్రణాళికలను రూపొందిస్తారు : ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణ ప్రజలు ఐదేళ్లు.. పదేళ్లకు ప్రణాళికలు రూపొందిస్తారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందేళ్లకు కావాల్సిన ప్రణాళికలను రూపొందిస్తారు. రూపొందించడమే కాకుండా వాటిని ఆచరణలో పెడతారని గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. నియోజకవర్గంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ల క్రితం చెక్ డ్యాంలు, ఫార్మ్ పౌండ్లు, ఇంకుడు గుంతల గురించి చెబితే ప్రజలు నవ్వుకున్నారన్నారు. నేడు రైతులు భూగర్భ జలాల కోసం బోర్ల లోతును పెంచుకుంటూ పోతున్నారన్నారు. అయినా కూడా భూగర్భ జలాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఏ నాయకుడైన చెరువులు, నదుల్లో నీటి కొలతను చూస్తారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఆలోచిస్తారన్నారు. భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి.. తగ్గితే వాటిని పెంచడం ఎలా? వాటిని సంరక్షించడం ఎలా అనే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని వివరించారు.

సీఎం చంద్రబాబు విజన్ గురించి తెలియజేస్తూ.. మొంథా తుఫాను సమయంలో నియోజకవర్గ పరిధిలో సంపత్ సువర్ణ రకం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే పంట తడి ఆరకపోతే మొలకలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో ఉప్పు చల్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ వందల ఎకరాలకు ఉప్పును చల్లడం సాధ్యపడే విషయం కాదన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందజేసిన డ్రోన్ లు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. డ్రోన్ లు ఉపయోగించి ఉప్పు ద్రావణం గోపాలపురం నియోజకవర్గంలో చల్లడం జరిగిందన్నారు. తరువాత వరి పంట కాపాడుకోగలిగామని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి ముందు చూపుకు చిన్నపాటి ఉదాహరణ మాత్రమేనన్నారు.

రైతుల ఆదాయం పెంచడం, ఉత్పతాదక శక్తి పెంచడం, వ్యవసాయ ఉత్పత్తి పెంచడం, మార్కెటింగ్ వాల్యూ పెంచడం గురించే ముఖ్యమంత్రి నిరంతరం ఆలోచిస్తుంటారన్నారు. ఆ తరుణంలోనే రైతన్న మీకో సం కోసం అనే పంచసూత్రాలను తీసుకొచ్చారన్నారు. నీటిని ఒడిసిపట్టి వాటిని సద్వినియోగం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. నదుల అనుసంధానంపై సీఎం స్పష్టతతో ఉన్నారన్నారని తెలిపారు. రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయడంతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, రాయలసీమ, శ్రీకాకుళం వరకు నీటిని తీసుకెళ్లగలిగామన్నారు. అయితే తన నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అన్నారు. కొవ్వాడ, తాడిపుడి, ఎర్ర కాలువ, కొంగువారి ప్రాజెక్ట్ చివరి దశలో ఉందన్నారు. వాటిల్లో సమస్యలు పరిష్కారం అయితే పంటల ఉత్పత్తి జరుగుతుందన్నారు. పంచసూత్రాల అనుగుణంగా సేంద్రీయ వ్యవసాయాన్ని అలవరచుకుంటామని ఎమ్మెల్యే ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి వాటిని అమలు పరుస్తామన్నారు. సీఎం సూచించిన అంశాలను ఆచరించి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.

Next Story