నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-13 06:48:44  IST  )

సీఎం స్వగ్రామంలో మొదలైన సంక్రాంతి సందడి.

నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్వగ్రామమైన నారావారిపల్లెలో (Naravaripalle) సంక్రాంతి సందడి (Sankranti Celebrations) మొదలైంది. సీఎం కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలను స్వగ్రామంలో జరుపుకోనున్న నేపథ్యంలో గ్రామం అంతటా ఉత్సాహాకర వాతావరణం నెలకొంది. సీఎం వస్తున్నారనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే గ్రామస్తులు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. భారీ ఫ్లెక్సీలతో పాటు స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి చేరుకున్నారు. కాకినాడ జిల్లాలోని సార్లంకలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేసిన అనంతరం ఆయన నారావారిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతాన్ని పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు తన కోసం వేచి చూస్తున్న గ్రామస్తులను స్వయంగా పలకరించారు. వారి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తూ గ్రామంలోకి ప్రవేశించారు. అందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. సీఎం రాకతో గ్రామం అంతటా హైఅలర్ట్ వాతావరణం నెలకొంది. పోలీసులు, సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అయితే సీఎం కంటే ముందే నారావారి కోడలు, మంత్రి నారా లోకేశ్ సతీమని నారా బ్రాహ్మణి గ్రామానికి చేరుకొని సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములయ్యారు.

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు ముగ్గుల పోటీలను పరిశీలించారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీఎం కుటుంబంతో కలిసి వీక్షిస్తున్నారు. కోలాటం, చిన్నారుల ఆటల పోటీలను తిలకిస్తూ ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు.

Next Story