- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలకు చెక్..! నియామక ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి తుది మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యే వరకు.. ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా, పక్కా నిబంధనల ప్రకారమే నిర్వహించామని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు నియామక ప్రక్రియ పారదర్శకతను వివరిస్తూ పక్కా ఆధారాలను ప్రజల ముందు ఉంచింది. అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకునేలా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని మండిపడింది.
పేపర్ లీక్‌కు ఆస్కారమే లేదు!
పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. TCS iON డిజిటల్ ప్లాట్‌ఫామ్, 256-బిట్ ఎన్‌క్రిప్షన్, ర్యాండమైజేషన్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థల నడుమ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. 42 వేల ప్రశ్నలతో కూడిన బ్యాంక్ ఏర్పాటు, బహుళ మార్కింగ్ (మల్టిపుల్ మార్కింగ్) విధానం, బయోమెట్రిక్ హాజరు వంటి కఠిన నిబంధనల వల్ల అసలు పేపర్ లీకేజీకి అవకాశమే లేదని ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.
సందేహాల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ
అభ్యర్థుల సందేహాలు, అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనికోసం ఏకంగా ‘మూడు స్థాయిల గ్రీవెన్స్ (ఫిర్యాదుల పరిష్కార) వ్యవస్థ’ను ఏర్పాటు చేసి, వేలాది మంది అభ్యర్థుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించినట్లు పేర్కొంది. మెరిట్ జాబితాలు, ఆన్సర్ కీలతో పాటు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి పారదర్శకతకు పెద్దపీట వేశామని ప్రభుత్వం వివరించింది.
148 రోజుల్లోనే అద్భుతం..
గత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరుతో హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ హామీలను నిజం చేస్తూ కార్యరూపంలోకి తీసుకొచ్చిందని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 148 రోజుల్లోనే దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగాలు సాధించలేకపోయిన అభ్యర్థుల కృషిని అవమానించేలా తప్పుడు ప్రచారాలు చేయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనని ప్రభుత్వం మండిపడింది. మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా ఎంత ప్రచారం చేసినా.. మొత్తం నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశ పక్కాగా రికార్డుల్లోనే నమోదై ఉందని, పారదర్శకతకు ఆ రికార్డులే సజీవ సాక్ష్యాలని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.






