బీజేపీతో టీడీపీ పొత్తు.. మోడీతో బాబు మాటామంతి సంకేతమిదేనా?

by Disha Web Desk 2 |
బీజేపీతో టీడీపీ పొత్తు.. మోడీతో బాబు మాటామంతి సంకేతమిదేనా?
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని మోడీతో చంద్రబాబు మాటామంతీ. ఇంకేముంది! పొత్తుకు సంకేతాలిచ్చినట్లేనంటూ టీడీపీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వాస్తవంగా కేంద్రంలోని బీజేపీ పెద్దల ఎత్తుగడ వేరు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతోనూ తత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వైసీపీ సర్కారుకు తెర వెనుక నుంచి సాయం చేస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబును పలకరిస్తుంటారు. మీకు మేం దూరంగా లేమనే సంకేతాలు ఇస్తుంటారు. ఎన్నికల నాటికి తగు నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో బీజేపీ బలమెంతో అధిష్టానానికి తెలుసు. అందుకే ఇలాంటి వ్యూహంతో మూడు పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తుంటారు. మోడీతో మాట కలిపినంత మాత్రాన పొత్తులపై ఆశ పెట్టుకోవడంలో అర్థం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుకు మనదేశం ఆతిథ్యమిస్తోంది. సదస్సు నిర్వహణ కోసం ప్రధాని మోడీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల అధినేతలు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి సీఎం జగన్‌తోపాటు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్​ నాలెడ్జ్​అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించడం యాధృచ్చికం కావొచ్చు. టీడీపీకి పొత్తులపై ఆశలు పెంచడానికి అయ్యుండొచ్చు. లేదా సీఎం జగన్‌ను మరికొన్ని అంశాల్లో మెడలు వంచడానికి ఎత్తుగడ అనుకోవచ్చు.

చంద్రబాబు ఢిల్లీ బయల్దేరిన దగ్గర నుంచి టీడీపీ శ్రేణుల్లో ఒకటే ఉత్కంఠ. ప్రధాని మోడీ నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు. వాళ్లు ఆశించినట్లే సదస్సులో చంద్రబాబు ప్రసంగంలోని అంశాన్ని మోడీ ప్రస్తావించారు. ఇంకా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో మాటలు కలిపారు. ఇవన్నీ బీజేపీ స్నేహ హస్తం అందిస్తుందనే దానికి సంకేతాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల మాదిరిగా విజయతీరాలను చేరుకోవచ్చనే ఆశతో ఉన్నారు.

మరోవైపున టీడీపీలో కొందరు బీజేపీ పట్ల పార్టీ సానుకూలంగా వ్యవహరించడాన్ని సహించలేకపోతున్నారు. ఇక్కడ బీజేపీని వ్యతిరేకించకుండా కేవలం వైసీపీ మీదనే గురి పెడితే పార్టీకి ఆశించిన మేర ప్రజల మద్దతును కూడగట్టలేమని భావిస్తున్నారు. విశాఖ స్టీల్​ప్లాంటు నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా కేంద్ర వైఖరిని నిలేయకుండా వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా టీడీపీ పుంజుకునే అవకాశం లేదంటున్నారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్టును ఇవ్వకుండా కేంద్ర సర్కారు మోసం చేసిందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తుందని సగటు ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిత్యావసరాలపై కూడా జీఎస్టీ పన్ను వేయడంపై జనం బీజేపీ అంటనే కన్నెర్రజేస్తున్నారు.

ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ దురాగతాన్ని ప్రశ్నించకుండా కేవలం వైసీపీని తిట్టిపోసినా ఆశించిన ప్రయోజనం దక్కదని మదనపడుతున్నారు. బీజేపీ, వైసీపీని ఒకేగాటన కట్టకుండా పార్టీకి పూర్వ వైభవం రాదని ఒకటే ఇదైపోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడంతోపాటు త్వరలో ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లను గృహాలకూ బిగించనున్నారు. పోర్టులతోపాటు థర్మల్​విద్యుత్​ కేంద్రాలనూ అదానీ పరం చేయడానికి వైసీపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కేంద్రంలోని బీజేపీని టార్గెట్​చేయకుంటే పార్టీకి మైలేజీ రాదని తెగ బాధపడిపోతున్నారు. మరి వీళ్ల అభిప్రాయాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారా! లేక పొత్తు ఆశల పల్లకిలో విహరిస్తారా అనే దానిపై టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

వైఎస్ షర్మిల రాజకీయ కామెంట్ల వెనుక కథ ఇదేనా?


Next Story