అమాయకత్వమే ఆసరాగా.. మహిళను బురిడీ కొట్టించి చైన్ చోరీ

by Vemula.Srinu Prasad |

అమాయకత్వమే ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో పట్టపగలే ఓ మహిళను బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. ..

అమాయకత్వమే ఆసరాగా.. మహిళను బురిడీ కొట్టించి చైన్ చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పెనుమూరులో పట్టపగలే ఓ మహిళను బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. పెనుమూరు మండలం కేసీ పల్లెకు చెందిన కాంతమ్మ అనే మహిళ బ్యాంకు పనుల నిమిత్తం పెనుమూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పలకరించి, మాటల్లో దించి నమ్మబలికారు.

నమ్మించి...

దొంగలు ఉన్నారంటూ, మెడలోని బంగారు గొలుసును జాగ్రత్తగా దాచుకోవాలని ఆ కేటుగాళ్లు కాంతమ్మకు సలహా ఇచ్చారు. భయం భయంగా ఉన్న ఆమెను నమ్మించి, గొలుసును తీయించి ఒక కాగితంలో చుట్టినట్లు నటించారు. అత్యంత చాకచక్యంగా గొలుసును తమ వద్దే ఉంచుకుని, కాగితంలో రాళ్లను చుట్టి ఆమె చేతికి ఇచ్చారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏమరపాటుగా బ్యాంకులోకి వెళ్లి లోపల కాగితం విప్పి చూడగా అందులో బంగారు గొలుసుకు బదులుగా రాళ్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

కాంతమ్మ లబోదిబో

తాను మోసపోయానని గ్రహించిన కాంతమ్మ లబోదిబోమంటూ అక్కడే కన్నీరుమున్నీరైంది. జరిగిన విషయాన్ని స్థానికులకు వివరించి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి బంగారు ఆభరణాలు తీసి ఇవ్వవద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరించారు.

Next Story