పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-31 08:52:58  IST  )

కేంద్రం రేపు లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనుంది. నేడు ఈ బిల్లును లోక్ సభ బిజినెస్ జాబితాలో చేర్చింది.

పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోంశాఖ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చింది. బుధవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభకు పంపనున్నారు. రేపు, ఎల్లుండి (బుధ, గురు వారాల్లో) ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాల సమాచారం.

రాజధానిగా శాశ్వత హోదా

విభజన చట్టంలోని కొన్ని అంశాలను సవరించడం ద్వారా అమరావతికి చట్టబద్ధత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. దీనివల్ల అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి అందే నిధులు, ప్రాజెక్టులకు మరింత చట్టబద్ధమైన భరోసా లభించనుంది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగానే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఉత్కంఠగా ఏపీ రాజకీయాలు

పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడంలో ఈ బిల్లు అత్యంత కీలకం కానుంది. రేపు కేంద్ర హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై పూర్తిస్థాయి చర్చ జరగనుంది.

Next Story