- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్టహాసంగా AU శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ భారత దేశంలోనే విద్యా విజ్ఞానాలకు కేంద్రమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) శతాబ్ది ఉత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వందేళ్ల చారిత్రక ప్రస్థానానికి గుర్తుగా విశాఖపట్నంలోని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది పూర్వ విద్యార్థులు ఈ ఉత్సవాలకు తరలిరావడంతో ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.
ఈ చారిత్రక ఘట్టానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఒడిశా గవర్నర్ కె. హరిబాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. అలాగే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ వందేళ్ల ఘనతను చాటిచెబుతూ ప్రత్యేక పోస్టల్ స్టాంపును అతిథులు ఆవిష్కరించారు. ఇదే వేదిక నుంచి వర్సిటీలో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 25 వేల మందికి పైగా హాజరైన ఈ వేడుకల కోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మూడు భారీ జర్మన్ షెడ్లను నిర్మించి, సీటింగ్ కోసం ప్రత్యేక విభాగాలు కేటాయించారు. ప్రధాన వేదికకు ఇరువైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని అందరికీ కనిపించేలా తీర్చిదిద్దారు. పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుని, రాబోయే తరాలకు సరికొత్త స్ఫూర్తినిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉత్సవాలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలు విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనున్నాయి.






