జాతీయ రహదారిపై సిమెంట్‌ ఫ్లై యాష్‌ ట్యాంకర్‌ బీభత్సం

by Naga Rani Yarlagadda |

కడప జిల్లా జాతీయ రహదారిపై మరో ఫ్లైయాష్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది.

జాతీయ రహదారిపై సిమెంట్‌ ఫ్లై యాష్‌ ట్యాంకర్‌ బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో 67వ జాతీయ రహదారిపై సిమెంట్ ఫ్లై యాష్ తో వెళ్తున్న ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ బస్సు బోల్తా పడగా.. మరో కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఇలాంటి ఫ్లై యాష్ ట్యాంకరే ఆగి ఉన్న కారుపై బోల్తా పడగా.. ప్రమాదంలో హైకోర్టు లాయర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే.. మరో ఫ్లై యాష్ ట్యాంకర్ ప్రమాదానికి కారణం కావడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

మైదుకూరు మండలం వరదాయపల్లె వద్ద బద్వేలు నుంచి మైదుకూరు వైపు వస్తోన్న సిమెంట్ ట్యాంకర్ ముందు వెళ్తున్న కడప ఇంజినీరింగ్ కళాశాల బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కాలేజీ బస్సు కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ క్రమంలో ఒక కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఫ్లైయాష్ ట్యాంకర్ సృష్టించిన ఈ బీభత్సంలో బస్సు డ్రైవర్, ట్యాంకర్ డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. కాగా.. ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో నలుగురు స్టూడెంట్స్ ఉండగా.. ఎవరికీ గాయాలు కాలేదని, కళాశాల సిబ్బంది తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన ట్యాంకర్, కాలేజీ బస్సులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story