ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు

by Thanuru Gopichand |

ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ (Ernakulam Express) అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది.

ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ (Ernakulam Express) అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. తుని జీఆర్పీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. అగ్నిప్రమాదం (Fire Accident) కారణంగా బోగీలో మృతి చెందిన చంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఇప్పటికే రెండు ఎఫ్ఎస్ఎల్ బృందాలు దర్యాప్తును చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి అదనంగా మరో మూడు ఏసీ బోగీలను జోడించి ప్రయాణికులను టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో పంపించారు. రైలు సుమారు ఏడు గంటలు ఆలస్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా ఎలమంచిలి మీదుగా వెళ్లే ఇతర రైళ్లు కూడా ఆలస్యం అయ్యాయి. అయితే ఎలమంచిలి హాల్ట్ లేని రైళ్లను ఆపకుండా పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఘటనలో కేవలం ఒకరే మృతి చెందారని.. పైలట్, రైలు సిబ్బంది అప్రమత్తత కారణంగా ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారని వెల్లడించారు.

డిప్యూటీ సీఎం స్పందన

టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరగడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజు తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమవ్వగా, ఒకరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటన సమయంలో దాదాపు 160 మంది ప్రయాణికులు బీ1, ఎం1 రెండు బోగీల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, అదృష్టవశాత్తు వారు క్షేమంగా బయటపడ్డారన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story