చంద్రగిరి మండలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-21 06:29:52  IST  )

మాదకద్రవ్యాలకు బానిసలై నేరాల బాట పడుతున్న యువత.

చంద్రగిరి మండలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) జిల్లాలోని చంద్రగిరి (Chandragiri) మండలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి కారణంగా బయట తిరగాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఓ గంజాయి బ్యాచ్ మండల పరిధిలోని ఎగువరెడ్డివారిపల్లిలో (Eguvareddyvaripalli) హల్ చల్ చేసింది. తమకు అడ్డెవరనుకున్నారా ఏమో బ్యాచ్ లోని సభ్యులు మంగళవారం అర్థరాత్రి మరింత రెచ్చిపోయారు. గ్రామంలోని పలువురి ఇండ్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లను విసురుతూ దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. వారి రాళ్ల దాడిలో పలు ఇండ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనాలు, విద్యుత్ మీటర్లు ధ్వంసం అయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపినట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఎగువరెడ్డివారిపల్లి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లగానే మరోసారి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందని.. గ్రామంలో హంగామా చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే సన్నీ అనే వ్యక్తి ఈ బ్యాచ్ కు నాయకత్వం వహిస్తున్నాడని, గతంలోనూ ఇటువంటివి చేశాడని పేర్కొంటున్నారు. గంజాయి బ్యాచ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డివారిలపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకొని తమకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Next Story