జిల్లా, మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు

by Yella Dhawani Reddy |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

జిల్లా, మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhrapradesh) పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు, గ్రామాల పేర్ల మార్పులు, చేర్పులపై సమగ్ర అధ్యయనం కోసం రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని (Cabinet Subcommittee) ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల నేపథ్యంలో తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘంలో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సరిహద్దుల పునర్వ్యవస్థీకరణలో పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక సమీపత, చారిత్రక, సాంస్కృతిక అంశాలపై వీరు సూచనలు చేయనున్నారు.

ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, సామాజిక, ఆర్థిక, అభివృద్ధి దృష్ట్యా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Next Story