సహనంతో ముందుకు సాగితేనే సమసమాజ నిర్మాణం : మంత్రి

by Thanuru Gopichand |

ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి పరస్పర ప్రేమ, సహనంతో ముందుకు సాగితేనే నిజమైన సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) అన్నారు.

సహనంతో ముందుకు సాగితేనే సమసమాజ నిర్మాణం : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి పరస్పర ప్రేమ, సహనంతో ముందుకు సాగితేనే నిజమైన సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) అన్నారు. నిడదవోలు రూరల్ మండలం పరిధిలోని సమిశ్రగూడెం గ్రామంలో ఉన్న బేతస్థ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను (Semi Christmas Celebrations) సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మంత్రి మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దైవజనులు తనకు ఆశీర్వాదాన్ని అందించినందుకు గానూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, శాంతి అనే విలువలను ప్రపంచానికి బోధించిన మహానుభావుడు ఏసు క్రీస్తు ప్రభువు అని అన్నారు. వారి జీవితం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని అన్నారు. తనను హింసించిన వారికి సైతం క్షమాభిక్షను పెట్టమని పరలోక ప్రభువును కోరిన ఏసు క్రీస్తు ప్రభువు మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. వారు చూపిన మార్గం దుష్టులను శిక్షించాలి, శిష్టులను రక్షించాలి అనే పరంపరాగత భావనకు అతీతమైనదని కొనియాడారు. అందుకే ప్రతిఒక్కరం స్వార్థాన్ని వీడి, పరస్పర ప్రేమతో సహనంతో ముందుకు సాగితేనే నిజమైన సమ సమాజం నిర్మాణం సాకారమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను సమిశ్రగూడెం ప్రాంతానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు కూడా దైవజనులు తనను ఆశీర్వదించారన్నారు. నాటి ఆశీస్సుల వల్లే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రిగా పని చేసే అవకాశం తనకు ఏసు క్రీస్తు ఆశీస్సుల వల్లే వచ్చిందని విశ్వసిస్తున్నానని తెలిపారు. దార్శనిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శనం, జన సేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రజా సేవలో మరింత బలంగా నిలబడుతున్నానని వివరించారు. సమాజంలో శాంతి, ప్రేమ, సేవ అనే విలువలు మరింత వికసించాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు.

Next Story