వంశీకి సపోర్ట్‌గా పేర్ని నాని.. మండిపడిన బుద్ధా వెంకన్న

by Naga Rani Yarlagadda |

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తప్పుపట్టారు.

వంశీకి సపోర్ట్‌గా పేర్ని నాని.. మండిపడిన బుద్ధా వెంకన్న
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తప్పుపట్టారు. వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడికివెళ్లిన పేర్నినాని ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. సీరియస్ గా ఉంటే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేస్తామని డాక్టర్లు చెప్పారని, ప్రభుత్వానికి కక్షలేమైనా ఉంటే ఒక ఏడాది జైల్లో పెట్టాలి కానీ.. మనిషిని చంపి పైశాచిక ఆనందం పొందాలనుకోవడం సరికాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో వంశీ తప్పు చేసినట్లు చెప్తున్నారని, తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరన్నారు.

పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పేర్నినాని మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని నొక్కేశారని విమర్శించారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వంశీకి వేలకోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర సమరయోధుడు కాదని, అలాంటి వ్యక్తికి పేర్ని నాని ఒత్తాసు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో కక్షపూరితంగా కొల్లు రవీంద్రను హత్యకేసులో ఇరికించి జైలుకు పంపిన పేర్ని నాని నేడు వల్లభనేని వంశీ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వంశీని వంగవీటి రంగాతో పోల్చడం ఇంకా విడ్డూరంగా ఉందన్నారు.

Next Story