పొలం కారణంగా సోదరుల పోరు.. ఒకరి మృతి

by Thanuru Gopichand |

కలి కాలంలో కనుమరుగువుతున్న మానవ సంబంధాలు.

పొలం కారణంగా సోదరుల పోరు.. ఒకరి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathaya Sai District) మడకశిర మండలంలోని బి.రాయపురం గ్రామంలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం విషయమైన వివాదం అన్నదమ్ముల మధ్య గొడవలకు కారణమైంది. కేవలం భూ వివాదం (Land Dispute) కారణంగా సొంత అన్నను తమ్ముడే అతి దారుణంగా వేట కొడవలితో (Younger Brother Killed His Older Brother) నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాధాకృష్ణ, అతని తమ్ముడు ఈరేగౌడ్ మధ్య కొంతకాలంగా పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి భూమి పంపకాలపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు ఈరేగౌడ్, తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో అన్న రాధాకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ తీవ్రమైన దాడిలో రాధాకృష్ణ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కళ్లెదుటే జరిగిన ఈ ఘాతుకాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడు ఈరేగౌడ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రక్తసంబంధాన్ని మర్చిపోయి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

Next Story