ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహంలాంటి జగన్ ముందు కాదు : బాలకృష్ణపై మంత్రి రోజా

by Disha Web Desk 21 |
ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహంలాంటి జగన్ ముందు కాదు : బాలకృష్ణపై మంత్రి రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేయడంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బావ కళ్లల్లో ఆనందం కోసమే బాలయ్య మీసం తిప్పారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను సినిమా సెట్టింగ్ అనుకుని తిప్పారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఈ మీసం తిప్పడం, తొడలు కొట్టడం ఏదో తన తండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చేసి ఉంటే బాగుండేది అన్నారు. తన తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు సకాలంలో స్పందించినందుకు ఎన్టీఆర్ ఆత్మకు శాంతికలిగేదని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడారు అని రోజా నిలదీశారు. ఈ తొమ్మిదేళ్లలో కనీసం తొమ్మిది అంశాలపైనా హిందూపురం నియోజకవర్గం గురించి అసెంబ్లీలో బాలకృష్ణ చర్చించారా అని ప్రశ్నించారు. సినిమా షూటింగ్‌లు చేసుకోవడం, గ్యాప్ సమయంలో వచ్చి సంతకం పెట్టి వెళ్లడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నందమూరి బాలకృష్ణ స్కిల్ స్కామ్‌పై సభలో చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. మైక్ ఇస్తామని స్కిల్ స్కామ్‌పై తన బావ తప్పు చేయకపోతే చర్చించాలని మంత్రి ఆర్‌కే రోజా సవాల్ విసిరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నిండు సభలో మీసం మెలేసి తొడగొడట్టమేంటి..? అసలు ఆయనకు సిగ్గుందా..? అని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. నువ్వు మీసం మెలేసి తొడ కొడితే ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరు అని హెచ్చరించారు. నాతోపాటు తొమ్మిదేళ్లుగా బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం గురించి గానీ అక్కడ ప్రజల గురించికానీ, ఏరోజూ పట్టించుకోలేదని విమర్శించారు. ఈరోజు శాసనసభకొచ్చి బావ కళ్లల్లో ఆనందం చూడటానికి తెగ ఆరాట పడుతున్నాడు అని మండిపడ్డారు. ఈ మీసాలు తిప్పడమేంటో.. వాళ్ల నాన్న మీద వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర చంద్రబాబు చెప్పులేయించినప్పుడు చేసుంటే బాగుండేదన్నారు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. కానీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో దొంగగా ఆధారాలతో సహా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే.. ప్రజలకు కోర్టులు, చట్టాల పట్ల నమ్మకం కలిగిన తరుణంలో బాలకృష్ణ ఈ స్థాయికి దిగజారడం నీచాతీనీచంగా చూడాలి అని మంత్రి ఆర్‌కే రోజా చెప్పుకొచ్చారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహంలాంటి జగన్ ముందు కాదు అంటూ మంత్రి ఆర్‌కే రోజా తనదైన శైలిలో బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు.


Read More..

మీసం మెలేసిన బాలయ్య : స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్!



Next Story

Most Viewed