తెలంగాణలోని ఏపీ హోంగార్డులను రప్పించండి: CPI రామకృష్ణ

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-29 07:52:15  IST  )

ఏపీ హోంమంత్రి అనితను సీపీఐ కె.రామకృష్ణ మర్యదాపూర్వకంగా కలిశారు

తెలంగాణలోని ఏపీ హోంగార్డులను రప్పించండి: CPI రామకృష్ణ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ హోంమంత్రి అనితను సీపీఐ కె.రామకృష్ణ మర్యదాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉంటున్న 400 మంది హోంగార్డులను ఏపీకి తీసుకు రావాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(CPI) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు(మంగళవారం) హోంమంత్రి వంగలపూడి అనితకు వినతి పత్రాన్ని అందించారు. అలాగే, వారికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింప చేయాలని కోరారు.

ఈ క్రమంలో హోంగార్డులను కానిస్టేబుల్ నియామకాల్లో పక్కన పెట్టడం వలన చాలా నష్టపోతున్నారని సీపీఐ రామకృష్ణ తెలిపారు. కుటుంబ కారణాలు, ఆరోగ్య సమస్యలు, విద్యా అవసరాలు, భద్రతా దృష్టితో హోంగార్డులు తీవ్రంగా బాధ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హోంగార్డుల శాశ్వత పరిష్కారం జరిగి ఉండాల్సిందని, కానీ ఇప్పటికీ వారు అనిశ్చితిలో ఉన్నారని కె. రామకృష్ణ చెప్పారు. ఈ అంశంపై హోంశాఖ సమగ్ర విచారణ జరిపి, హోంగార్డుల బదిలీలకు అనుమతించాలని కోరారు.

సుమారు 400 మంది హోంగార్డులు ప్రస్తుతం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 400 మంది తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని హోం మంత్రికి వివరించారు. ఈ క్రమంలో వారందరినీ వారి సొంత రాష్ట్రాలకు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు. హోంగార్డుల సమస్యల పై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించడం పట్ల సీపీఐ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

Next Story