క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు.. క్రికెట్ ఆడిన మంత్రి

by Jakkula.Mamatha |

రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) తెలిపారు.

క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు.. క్రికెట్ ఆడిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) తెలిపారు. నేడు(శనివారం) రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్ లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్‌లో లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో, ప్రజలను కలుస్తూ బిజీ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ ఇవాళ క్రికెట్ బ్యాట్ చేతబట్టి కాసేపు యువతను, క్రీడాకారులను అలరించారు. తనదైన శైలిలో క్రికెట్ ఆడి పలువురిని ఆకర్షించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు రాజకీయ చిత్తశుద్ధి కావాలన్నారు. గతంలో రాజకీయ నాయకులకు సరైన చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అద్భుతమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసేందుకు అనువైన స్థలం కేటాయించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా రాజమహేంద్రవరం ఉండటంతో క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రిగా తాను, కలెక్టర్, ఎస్పీలు అంతా టీమ్ గా ఏర్పడి యుద్ధప్రాతిపదికన రాజమహేంద్రవరంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. క్రీడల పట్ల మక్కువ కలిగిన సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు(Deputy CM Pawan Kalyan) క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూపకల్పన జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయ పాలన, క్రీడాస్ఫూర్తి అలవడుతుందన్నారు. క్రీడాస్ఫూర్తి ద్వారా విద్యార్థులు తమ నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా అధిగమించగలరని వివరించారు. క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.

నిరంతరం క్రీడా టోర్నమెంట్ లు నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను మంత్రి దుర్గేష్ అభినందించారు. 40 ఏళ్లు దాటిన వాళ్లకు సైతం దేహదారుఢ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించడం వీరి ప్రత్యేకత అన్నారు. చదువుతో పాటు క్రీడాకారిణిగా అద్భుతమైన భవిష్యత్ ను ఆశిస్తు ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి క్రికెట్ లో తన భవిష్యత్ వెతుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. కళలు, సంస్కృతి, సాంప్రదాయాల్లో రాజమహేంద్రవరానికి ఎంత పేరుందో అంతే స్థాయిలో క్రీడలకు సైతం రాజమహేంద్రవరానికి పేరుందన్నారు. ఒక్క క్రికెట్ అనే కాదు అనేక క్రీడల్లో ఇక్కడి వారు రాణించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రత్యేకించి ఇక్కడే పుట్టి రాణించిన పుట్ బాల్ క్రీడాకారుడు నింబస్, సుంకర భాస్కర్ రావు, చాముండేశ్వరి రాజా, భాస్కర్ నాథ్,ఆదిశేషు, అంతేగాక బాస్కెట్ బాల్ లో సైతం పలువురు రాణించారని గుర్తుచేశారు. ఎంతో మంది యువ క్రీడాకారులను తయారు చేసి భారత క్రికెట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు అహర్నిశలు కృషి చేసిన క్రీడాకారులు ఎమ్మెస్కే ప్రసాద్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

Next Story