- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొత్స అనూష రాజకీయ అరంగేట్రం ఖరారైందా? : ఉత్తరాంధ్రలో మారుతున్న సమీకరణాలు
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న బొత్స కుటుంబం నుండి మరో వారసురాలు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న బొత్స కుటుంబం నుండి మరో వారసురాలు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష గత కొంతకాలంగా చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం తండ్రికి సహాయకురాలిగా మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ముఖ్యంగా గరివిడిలోని క్యాంప్ కార్యాలయం వేదికగా ఆమె నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతం చేయడంలో అనూష కీలక పాత్ర పోషించారు. దీనికి తోడు.. ఇటీవల పార్టీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా ఆమె తన నాయకత్వ పటిమను చాటుకున్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్రస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, చీపురుపల్లి బాధ్యతలను ఆమెకే అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేసిన వ్యాఖ్యలు కూడా అనూష రాజకీయ బాధ్యతలపై అధికారిక ముద్ర వేశాయి.
మేనల్లుడి ప్రకటనతో..
ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి బాధ్యతలను అనూషే చూసుకుంటారని బహిరంగంగా ప్రకటించడం రాజకీయంగా స్పష్టతనిచ్చింది. ‘మన కుటుంబం – మన కార్యకర్త’ వంటి కార్యక్రమాల ద్వారా కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తూ, ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్న ఆమె, భవిష్యత్తులో చీపురుపల్లి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.
జడ్పీటీసీగా పోటీ ?
రాబోయే రోజుల్లో ఆమె తల్లి బొత్స ఝాన్సీ బాటలోనే నడుస్తూ స్థానిక సంస్థల ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా గరివిడి లేదా గుర్ల మండలాల నుండి జడ్పిటీసీగా పోటీ చేసి, జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో ఆమె అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 'మన కుటుంబం – మన కార్యకర్త' అనే నినాదంతో ప్రతిగ్రామంలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న తీరు చూస్తుంటే, చీపురుపల్లి భవిష్యత్ వారసురాలిగా ఆమె రాజకీయ స్థానం దాదాపు ఖరారైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ నెక్స్ట్ జరగబోయే పంచాయతీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే యువనేతలను పార్టీ నుంచి నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.






