నా మాటలను వక్రీకరించారు.. పార్టీ లైన్ దాటలేదు : బొండా ఉమా

by Ramesh Naini |

వైఎస్సార్సీపీ నేతలతో వేదిక పంచుకున్న వ్యవహారంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు.

నా మాటలను వక్రీకరించారు.. పార్టీ లైన్ దాటలేదు : బొండా ఉమా
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్సీపీ నేతలతో వేదిక పంచుకున్న వ్యవహారంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన ఆయన.. నేతలు పల్లా శ్రీనివాసరావు, రామానాయుడులను కలిసి జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆయన స్వయంగా వచ్చి తన వాదనను వినిపించారు.

సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఎప్పటికీ పార్టీ లైన్ దాటనని, సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎల్లప్పుడూ శిరసావహిస్తానని స్పష్టం చేశారు. కేవలం ఒక సంస్మరణ సభకు వెళ్లినప్పుడు మాత్రమే వైసీపీ నేతలను కలవాల్సి వచ్చిందని, కానీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని మండిపడ్డారు. కొన్ని దుష్టశక్తులు తన మాటలను, జరిగిన ఘటనను వక్రీకరించి బురదజల్లే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. తాను అనని మాటలను కూడా టీవీల్లో ప్రసారం చేశారన్నారు. ఇదంతా కేవలం సమన్వయ లోపమేనని పార్టీ పెద్దలకు వివరించానని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల గుంటూరులో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. అయితే, అదే సభకు వచ్చిన వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఆయన వేదిక పంచుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని సన్నిహితంగా మాట్లాడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Next Story