సమాజానికి ద్రోహం చెయ్యొద్దు: నాగేశ్వర్‌కు బొలిశెట్టి హితోపదేశం

by Vemula.Srinu Prasad |

మేధోపరమైన దివాళాకోరుతనంతో విశ్లేషకులు సమాజానికి ద్రోహం చెయ్యొద్దని విశ్లేషకులు కె.ఎస్. ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ హితవు పలికారు. ..

సమాజానికి ద్రోహం చెయ్యొద్దు: నాగేశ్వర్‌కు బొలిశెట్టి హితోపదేశం
X

దిశ, వెబ్ డెస్క్: మేధోపరమైన దివాళాకోరుతనంతో విశ్లేషకులు సమాజానికి ద్రోహం చెయ్యొద్దని విశ్లేషకులు కె.ఎస్. ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ హితవు పలికారు. జగన్‌ను అరెస్ట్ చేయాలని కేంద్రమంత్రి అమిత్ షాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నేడు కృత్రిమ మేధస్సు (AI) వల్ల తప్పుడు సమాచారాలతో ప్రజలు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నారని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు దిక్సూచిలా నిలవాల్సిన మేధావులే తమ విశ్వసనీయతను కోల్పోవడం అత్యంత విషాదకరమని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. ​"రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి" అనే పాత నానుడి నేడు విశ్లేషకులు కె.ఎస్. ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు విషయంలో కూడా నిజమవుతోంది!!. అని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ శక్తుల వ్యవస్థీకృత ఉచ్చులో చిక్కుకుని వాళ్ళు మేధోపరమైన 'ఆత్మహత్య'కు గురయ్యారు అని అనిపిస్తుందని, ఇదే నిజమైతే వారు చేసింది సంఘ ద్రోహమేనని బొలిశెట్టి పేర్కొన్నారు.

పరోక్షంగా కొమ్ముకాస్తున్న విశ్లేషకులు

చాలామంది విశ్లేషకులు పార్టీలకు పరోక్షంగా కొమ్ముకాస్తూ 'పెయిడ్ ఆర్టిస్టులు'గా మారడం జర్నలిజం విలువలకు తలవంపు అని బొలిశెట్టి విమర్శించారు. తాత్కాలిక TRPల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులను 'విశ్లేషకుల' ముసుగులో తెరపైకి తీసుకురావడం వల్ల, ఛానల్స్ తమ శాశ్వత విశ్వసనీయతను కోల్పోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన మీడియా, రోజువారీ టీవీ డిబేట్ సీరియల్స్ కంటే ప్రజాహితమే తమ భాద్యత అని గుర్తించాలన్నారు. ఈ పక్షపాత ధోరణులను వీడి, తిరిగి తన తటస్థ స్థితిని నిలుపుకోవాల్సిన బాధ్యత మీడియాపై ఉందని చెప్పారు. మీడియా తన పాత్ర పొషిస్తేనే ప్రజలకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందుతాయని తెలిపారు. మేధావులు మౌనంగా ఉన్నా, లేదా పక్షపాతంతో రంగులు పులుముకుంటే చివరకు నష్టపోయేది మన చుట్టూ ఉన్న మన సమాజమేనని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.

Next Story