కోనసీమలో అదుపులోకి రాని ‘బ్లో అవుట్’.. అధికారుల యాక్షన్ ప్లాన్ సిద్ధం!

by Kema Shiva Kumar |

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. మలికిపురం మండల పరిధిలోని ఇరుసమండ గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) గ్యాస్ బావిలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున గ్యాస్ లీకై, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కోనసీమలో అదుపులోకి రాని ‘బ్లో అవుట్’.. అధికారుల యాక్షన్ ప్లాన్ సిద్ధం!
X

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లో హై టెన్షన్ నెలకొంది. మలికిపురం (Makilipuram) మండల పరిధిలోని ఇరుసమండ (Irusamandla) గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) గ్యాస్ బావిలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున గ్యాస్ లీకై, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు 100 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం.. మోరి-5 నంబర్ బావిలో మరమ్మతులు (Workover operations) చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్, క్రూడ్ ఆయిల్ విపరీతమైన పీడనంతో పైకి ఎగజిమ్మింది. దీనినే సాంకేతికంగా ‘బ్లో అవుట్’ అని పిలుస్తారు. గ్యాస్ లీకేజీ వల్ల గాలిలో నిప్పురవ్వలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ బావిని ప్రైవేట్ సంస్థ డీప్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం బావిలో సుమారు 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాస్ ఒత్తిడి తగ్గే వరకు మంటలను ఆర్పడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. మంటల తీవ్రతను తగ్గించేందుకు సమీపంలోని గూడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు ఇంజన్లు ఏర్పాటు చేశారు.

బావిని శాశ్వతంగా మూసివేసే ప్లాన్..

ఒకవేళ మంగళవారం మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే, బావిని శాశ్వతంగా మూసివేసే (Capping) ప్రక్రియను చేపట్టాలని ఓఎన్‌జీసీ నిపుణులు భావిస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం నుంచి నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఇరుసమండ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో రెండు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్కవరం తదితర ప్రాంతాల్లోని కళ్యాణ మండపాల్లో వారికి వసతి కల్పించారు. ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే..

Next Story