ద్రాక్షారామంలో దైవానికి అవమానం.. పోలీసుల అదుపులో నిందితుడు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-31 06:46:41  IST  )

పంచారామ క్షేత్రంలో మహాపాపం శివలింగానికి ఘోర అవమానం

ద్రాక్షారామంలో దైవానికి అవమానం.. పోలీసుల అదుపులో నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో (Draksha Ramam) మహాపాపం జరిగింది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలోని ఉత్తర గోపురం వద్ద దైవానికి అవమానం జరిగింది. సప్తగోదావరి నది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని (Kapaleswara Lingam) ఓ దుండగుడు భిన్నం చేసి ఘోర అవమానానికి గురిచేశాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోర ఘటనపై పోలీసులు సత్వరమే స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నాయకత్వంలో నిందితుడి కోసం గాలింపును నిన్ననే ప్రారంభించారు. ఈ క్రమంలో తోటపేటకు చెందిన ఓ అనుమానితుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శీలం శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. శివలింగం ఎందుకు ధ్వంసం చేశారనే కోణంలో నిందితుడిని విచారిస్తున్నారు. పూజారితో వివాదం కారణంగానే దుశ్చర్యకు పాల్పడినట్లు నిందితుడు చెబుతున్నాడని పోలీసులు చెబుతున్నారు.

సీరియస్ అయిన సీఎం..

ద్రాక్షారామంలో దుండగుల దుశ్చర్యపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఏ మతానికి చెందిన దైవ దూషణ జరిగినా అది ఖండించదగిన విషయంగా స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సీఎం మాట్లాడారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని సీఎం మంత్రికి సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

దుండగుడి దుశ్చర్య..

ద్రాక్షారామంలోని పురాతన శివలింగం ధ్వంసం కేసులో ప్రధాన అనుమానితులు అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో సప్త గోదావరి నది ఒడ్డుకు వచ్చాడు. తన స్కూటీని అక్కడ పార్క్ చేసి ఓ బ్యాగ్ తో లోపలికి ప్రవేశించాడు. కపాలేశ్వర స్వామి లింగాన్ని భిన్నం చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఈ దుశ్చర్య పట్ల సర్వత్రా భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా దుండగుడు వ్యవహరించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story