- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతికి కేంద్రం భారీ ఊతం.. కేబినెట్ నిర్ణయంపై మాధవ్ హర్షం
అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయం , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మాణాలకు మొత్తం రూ.2,533.99 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది..

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయం (సీజీజీపీఓఏ), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం (జీపీఆర్ఏ) నిర్మాణాలకు మొత్తం రూ.2,533.99 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది తాజా నిర్ణయం నిదర్శనమని మాధవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయం నిర్మాణానికి రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మాణానికి రూ.1,234.91 కోట్లు మంజూరు చేయడం ద్వారా రాజధాని అభివృద్ధికి మరో మైలురాయి పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5.53 ఎకరాల భూమిలో సుమారు 23.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఆధునిక టవర్లతో కూడిన కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మించనున్నారు. ఇందులో సుమారు 8,000 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడం ద్వారా పరిపాలనా సమన్వయం మెరుగుపడటంతో పాటు ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందనున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) ప్రాజెక్టులో 1,504 ఆధునిక నివాస యూనిట్లు, పార్కింగ్ సదుపాయాలు, కమ్యూనిటీ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) చేపట్టనుండగా, పర్యావరణహిత గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్మాణ దశలో ప్రతి ఏడాది సుమారు 7 లక్షల మాన్-డేస్ ఉపాధి, నిర్వహణ దశలో 50 వేల మాన్-డేస్ ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని మాధవ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రివర్గ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున పీవీయన్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు.






