బీజేపీ గత పదేళ్లుగా మోసం చేస్తునే ఉంది.. పోలవరంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

by Ramesh Goud |

బీజేపీ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉన్నదని, పదేళ్లలో 50 శాతం పనులు కూడా దాటలేదని పోలవరాన్ని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(APCC Chief YS Sharmila) మండిపడ్డారు.

బీజేపీ గత పదేళ్లుగా మోసం చేస్తునే ఉంది.. పోలవరంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉన్నదని, పదేళ్లలో 50 శాతం పనులు కూడా దాటలేదని పోలవరాన్ని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(APCC Chief YS Sharmila) మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులపై మీడియాతో మాట్లాడిన ఆమె.. గత, ప్రస్తుత ప్రభుత్వాలపై సంచలన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని, బీజేపీ (BJP) గత పదేళ్లుగా మోసం చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status)తో పాటు పోలవరం అంతే ముఖ్యమని, ఆంధ్ర జీవనాడి అయిన పోలవరం ఇవ్వాళ్టి వరకు పూర్తి కాలేదని, దీనికి బాధ్యత ఎవరు? అని ప్రశ్నించారు.

పోలవరం దివంగత వైఎస్ఆర్ (YSR) కల అని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అన్ని అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు.. 22 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో, రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో 194 టీఎంసీల సామర్థ్యంతో వైఎస్ఆర్ పనులు ప్రారంభించారని తెలిపారు. ఆనాడు ప్రాజెక్ట్ ఎత్తు 45.7 మీటర్లు ఉంటే.. ఇప్పుడు పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదించారని, ఇలా కడితే పోలవరం జీవనాడి అవ్వదని అన్నారు. వైఎస్ఆర్ హయంలో 33 శాతం పనులు అయ్యాయని, ఆ తర్వాత ఎవరు కూడా పోలవరం పనులను పట్టించుకోలేదని మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిందని తెలిపారు.

2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు (Chandrababu) కేవలం 17 శాతం పనులు చేశారని, ప్రాజెక్ట్ అంచనాను అమాంతం రూ.50వేల కోట్లకు పెంచేశారని చెప్పారు. ఇక జగన్ అధికారంలో వచ్చాక పోలవరం పనులు 3 శాతం దాటలేదని, తండ్రి ఆశయాన్ని జగన్ (Jagan) ముందుకు తీసుకువెళ్ళలేదని విమర్శలు చేశారు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్ట్ నాశనం చేశారని, మొత్తంగా పదేళ్లలో 50 శాతం పనులు దాటలేదని, అందరు కలిసి పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం మార్చేశారని ఫైర్ అయ్యారు. జగన్, బాబు ఇద్దరు బీజేపీకి లొంగిపోయారని, 41 మీటర్ల ఎత్తులో మాత్రమే R అండ్ R ఇవ్వాలని చూస్తున్నారని, ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో చెప్పడం లేదని, 41.15 మీటర్లు ఎత్తులోనే నిర్మాణం అని కేంద్రం పోలవరం వెబ్‌సైట్‌లో పెడితే మన ఎంపీలు నోరు మూసుకొని కూర్చున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రాజెక్ట్ బ్యారేజ్‌గా.. లిఫ్ట్ ఇరిగేషన్‌గా మిగిలి పోయే ప్రమాదం ఉందని, ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఈ కుట్రలో భాగం బాబు, జగన్, పవన్ అని, ఫేజ్ 1లో ఎన్ని ఎకరాలు.. ఫేజ్ 2లో ఎన్ని ఎకరాలు అనేది కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరంలో R అండ్ R ప్యాకేజీ ఇవ్వాలి అంటే రూ.33 వేల కోట్లు కావాలని, దాదాపు 96 వేల కుటుంబాలకు ఇంకా రీహాబిలిటేషన్ చేయాలని, 85 వేల కుటుంబాలకు R అండ్ R ఇవ్వకుండా ఎత్తు తగ్గించడం కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చి మోసం చేశారని, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం... ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి అంటూ.. 45.7 మీటర్ల ఎత్తు కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు.

Next Story