కర్నూల్ బస్సు దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ సమయంలో బైకర్ ఎందుకు వచ్చాడు..?

by Muthe.Rajitha |   (  Updated:2025-10-24 10:47:07  IST  )

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టి, ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

కర్నూల్ బస్సు దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ సమయంలో బైకర్ ఎందుకు వచ్చాడు..?
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టి, ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 21 మంది సజీవ దహనం కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ బైక్ ను ఢీకొట్టిన తర్వాత, ఆపకుండా వెళ్లడం వల్లే.. బైక్ బస్సు కిందికి చొచ్చుకుపోయి, నిప్పు రవ్వలు రేగి, ఆయిల్ ట్యాంకుకు అంటుకొని.. బస్సు మొత్తం మంటలు వ్యాపించాయని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు, బైకర్ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని వెలుగులోకి వచ్చింది.

మద్యం మత్తులో... రాంగ్ రూట్లో వచ్చిన బైకర్...

కర్నూల్ మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్(20)... నేషనల్ హైవే 44 మీద కర్నూలు పట్టణ సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్నట్టు తెలిసింది. అది కాకుండా గ్రానైట్ కంపెనీలో పనిచేసే శివశంకర్ గత రెండు రోజులు క్రితం తన పెళ్లి విషయంలో గొడవపడి, బైటికి వచ్చి... ఇంటికి వెళ్లకుండా మద్యం సేవిస్తూ బైక్ పై తిరుగుతున్నాడని సమాచారం. ప్రమాదానికి కొద్దిగంటల ముందు తల్లికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నేషనల్ హైవే మీద రాంగ్ రూట్లో బస్సుకు ఎదురు రావడంతో... బస్సు డ్రైవర్ ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేక బైక్ ను ఢీకొట్టి అలాగే 300 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్ళాడు. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్ బ్రేకులు వేసినా బస్సు పల్టీలు కొట్టేదని నిపుణులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు 120కిలోమీటర్ల స్పీడ్ తో ఉందని తెలుస్తోందని, ఆ స్పీడ్ తో బ్రేకులు వేయలేరని, ఒకవేళ వేస్తె బస్సు పల్టీలు కొట్టి అందరూ చనిపోయే వారని అంటున్నారు.

ట్రావెల్ బస్సుల అతివేగం..

అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రతీ ట్రావెల్ బస్సు అన్ని పాయింట్లలో ప్యాసింజర్లను ఎక్కించుకొని అర్థరాత్రి 12 తర్వాతే నగర శివార్లను దాటుతాయి. ఇక గమ్యస్ధానినికి చేరడానికి బస్సు డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళుతుంటారు. ప్రమాదాలు జరగడానికి ఈ అతివేగం కూడా ఒక కారణమే అని తెలుస్తోంది. రాత్రిపూట బైకర్స్ ను నేషనల్ హైవే మీదికి అనుమతించకపోవడం మంచిదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. రాత్రిపూట వివిధ రాష్ట్రాలకు వెళ్లే వందలాది బస్సులు, కేవలం రాత్రి మాత్రమే నగరంలోకి అనుమతించబడే భారీ వాహనాలు చాలా వేగంగా వెళుతూ ఉంటాయి. అలంటి సమయంలో వాటికి అడ్డుగా, లేదా వాటి దారిలో చిన్న వాహనాలైన బైకులు, ఆటోల వంటివి రోడ్ల మీదికి రావడం వల్ల, ఒక్కోసారి వాటి వేగం కంట్రోల్ అవక ఇలాంటి ప్రమాదాలకు ఛాన్స్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవేల మీద టూ వీలర్స్రా, త్రీ వీలర్స్ రాత్రిపూట తిరగకపోవడం బెటర్ అంటున్నారు.

ఏది ఏమైనా ఒక బైకర్ చిన్న నిర్లక్ష్యం.. 21 మంది సజీవ దహనమై, ప్రాణాలు కోల్పోయేలా చేసింది. రాత్రిపూట నేషనల్ హైవేల మీద, రాష్ట్ర రహదారుల మీద ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని, అది చిన్న మొత్తమే అయినా మద్యం తాగి వాహనాలు నడపకూడదని పలువురు సూచిస్తున్నారు.

Next Story