బురదకోట కొండల్లో పెద్దపులి.. అడవిలోకి వెళ్తుందా ?

by Naga Rani Yarlagadda |

కొద్దిరోజులుగా తూ.గో జిల్లాలో సంచరిస్తోన్న పెద్దపులి బుధవారం బురదకోట కొండల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

బురదకోట కొండల్లో పెద్దపులి.. అడవిలోకి వెళ్తుందా ?
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బురదకోట కొండ ప్రాంతంలో పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గతంలో బవురువాక ప్రాంతంలో సంచరించిన పెద్దపులి, ప్రస్తుతం బురదకోట దట్టమైన అటవీ ప్రాంతానికి తన మకాం మార్చింది. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రామస్తులకు అటవీ శాఖ హెచ్చరికలు

పులి కదలికల నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు పలు గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. బురదకోట, కొండపల్లి, బాపన్నధార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కె.మిర్తివాడ, ధారపల్లి తదితర గ్రామాల వారు పొలాలకు లేదా అటవీ సమీప ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. కాకినాడ డీఎఫ్‌వో (DFO) రామచంద్రరావు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అటవీ శాఖ బృందాలు నిరంతరం నిఘా ఉంచాయి. పులిని బంధించడానికి లేదా సురక్షితంగా అడవిలోకి పంపడానికి హనుమాన్ బృందంతో పాటు, అత్యవసర పరిస్థితి కోసం ట్రాంక్విలైజింగ్ (మత్తుమందు ఇచ్చే) బృందాలను కూడా సిద్ధం చేశారు. అటవీ శాఖ బృందాలు అత్యాధునిక కెమెరా ట్రాప్‌లు, డ్రోన్ల సాయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. ప్రజలు ఎవరూ భయపడవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.

Next Story