మంగళగిరిలో బీసీ ధర్మ దీక్ష ప్రారంభం

by Vemula.Srinu Prasad |

మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షను శనివారం ప్రారంభించారు..

మంగళగిరిలో బీసీ ధర్మ దీక్ష ప్రారంభం
X

దిశ, మంగళగిరి: మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షను శనివారం ప్రారంభించారు. బీసీవై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన ఈ దీక్షకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే మునిమనవరాలు రమాకాంత్ పూలే కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీసీలకు సంబంధించిన ఐదు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రక్షణ చట్టం అమలు, అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు, సమగ్ర కులగణన, అలాగే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించడం వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, గత ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహ గర్జన సభలోనే ఈ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో బీసీలకు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, మూడు కోట్లకు పైగా ఉన్న బీసీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు. అమరావతిలో ఇతర వర్గాలకు భూములు కేటాయించిన విధంగానే బీసీలకు కూడా 1000 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్‌ను కూడా ఈ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీక్షను భగ్నం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష కొనసాగుతుందని, బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.

Next Story