బాపట్ల | అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు!

by Thanuru Gopichand |

బాపట్ల పట్టణంలోని (Bapatla Town) చికెన్, మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు, మాంసాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బాపట్ల | అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : బాపట్ల పట్టణంలోని (Bapatla Town) చికెన్, మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు, మాంసాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పలు దుకాణాల్లో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని (Foul Meat), నాణ్యత లేని చికెన్, మటన్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా దుకాణాల్లో నిల్వ ఉంచిన పాడైపోయిన మాంసాన్ని మున్సిపల్ సిబ్బంది వెంటనే సీజ్ చేశారు. వారం రోజుల నాటి మాంసాన్ని ఫ్రిజ్‌లలో భద్రపరిచి విక్రయించడంపై అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

​పరిశుభ్రత పాటించని దుకాణదారులకు అధికారులు అక్కడికక్కడే భారీగా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మాంసం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. లాభాపేక్షతో వినియోగదారుల ప్రాణాలతో ఆడుకుంటే సహించేది లేదని అన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించే షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా మాంసం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story