నేడు శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి బాహుబలి

by Thanuru Gopichand |

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నేడు మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది.

నేడు శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి బాహుబలి
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నేడు మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. అత్యంత భారీ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో ‘బాహుబలి’గా పేరుగాంచిన ఎల్వీఎం-3 (LVM3-M6) రాకెట్ చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నేడు ఉదయం 8:54 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సుమారు 6,100 కిలోల (6.1 Tones) బరువున్న అమెరికాకు చెందిన 'బ్లూబర్డ్ బ్లాక్ 2' (BlueBird Block-2) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. భారత గడ్డపై నుండి ఇంతటి భారీ బరువు కలిగిన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇస్రో చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో తన అంతరిక్ష శక్తిని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పడంతో పాటు వాణిజ్య విభాగంలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తుంది.

ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా సామాన్య స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా సాటిలైట్ ద్వారా 5G సెల్యులార్ కనెక్టివిటీని అందించడం. అమెరికాకు చెందిన 'ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్' సంస్థ అభివృద్ధి చేసిన ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం మారుమూల ప్రాంతాలు, సముద్ర జలాలు, విమాన ప్రయాణాల్లో కూడా ఎలాంటి నెట్‌వర్క్ అంతరాయం లేకుండా హై-స్పీడ్ డేటా సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఉపగ్రహంలో 223 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భారీ యాంటెన్నా ఉంటుంది. ఇది అంతరిక్షంలోనే అతిపెద్ద కమ్యూనికేషన్ యాంటెన్నాగా రికార్డు సృష్టించనుంది. గతంలో ఇస్రో ఇటువంటి భారీ ఉపగ్రహాల కోసం విదేశీ రాకెట్లపై ఆధారపడేది. కానీ ఇప్పుడు స్వదేశీ 'బాహుబలి' రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తూ గ్లోబల్ కమర్షియల్ మార్కెట్‌లో తన పట్టును బలపరుచుకుంటోంది. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Next Story