Ayesha Meera murder case : ఆయేషా మీరా హత్య కేసు... ఏపీ హైకోర్టు విచారణ

by Muthe.Rajitha |   (  Updated:2025-06-27 13:50:01  IST  )

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు(Ayesha Meera Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Ayesha Meera murder case : ఆయేషా మీరా హత్య కేసు... ఏపీ హైకోర్టు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు(Ayesha Meera Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో ఆయేషా తల్లిదండ్రులు ఏపీ హైకోర్టు(AP High Court)లో ఇటీవల పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై నేడు విచారణ జరిగింది. సీబీఐ(CBI) తుది నివేదిక ఎందుకు ఇవ్వడం లేదో తమకు తెలియడం లేదని, కేసును మూసివేయాలని చూస్తున్నట్టు తమకు అనుమానాలు ఉన్నాయని ఆయేషా తల్లిదండ్రుల తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తాము కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామని, ఈ కేసు విచారణలో సీబీఐ అమ్ముడుపోయిందన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

మరోవైపు ఈ కేసులో దోషిగా అనుమానించిన సత్యంబాబు.. ఆయేషా మీరా హత్యతో నాకు సంబంధంలేదని మరోసారి స్పష్టం చేశాడు. స్వయంగా హైకోర్టు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ, విచారణ పేరుతో సీబీఐ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో ఆయేషా కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించాడు. కాగా 2007 డిసెంబర్ 27న విజయవాడలో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది. 2008లో పోలీసులు సత్యంబాబు అనే వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారు.

విజయవాడ మహిళా కోర్టు 2010లో అతడికి జీవిత ఖైదు విధించింది. కానీ 2017లో ఆధారాలు సరిపోవని, పోలీసు దర్యాప్తులో లోపాలున్నాయని తీర్పునిచ్చిన హైకోర్ట్... సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది. ఆయేషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించగా, 2018లో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఏడేళ్లపాటు (2018-2025) విచారణ చేసి.. 260 మంది సాక్షులను, 50 మంది పోలీసులను, 25 మంది హాస్టల్ సిబ్బంది, విద్యార్థులను ప్రశ్నించింది. 2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీ-పోస్ట్‌మార్టం చేసి, తలపై తీవ్ర గాయాలను నిర్ధారించింది.

2025 జూన్ 20న సీబీఐ తుది నివేదికను సీల్డ్ కవర్‌లో విజయవాడ సీబీఐ కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక వివరాల ఆధారంగా ఆయేషా తల్లిదండ్రులు మరోసారి హైకోర్టుకెక్కారు. ఈ కేసు 18 ఏళ్లుగా అనేక మలుపులతో, రాజకీయ ఒత్తిళ్లు, ఆధారాల ధ్వంసం, దర్యాప్తులో జాప్యం వంటి సమస్యలతో సంక్లిష్టంగా మారింది.

Next Story