మైనారిటీలం కాబట్టే మాకు న్యాయం చేయలేదు.. అయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

సీబీఐ జ‌డ్జి ముందు త‌ల్లిదండ్రులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం అయేషా త‌ల్లి మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

మైనారిటీలం కాబట్టే మాకు న్యాయం చేయలేదు.. అయేషా తల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అయేషా మీరా కేసు నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. హత్య జరిగిన 19 ఏళ్ల తర్వాత అయేషా అస్థికలకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తున్నారు. అయేషా తల్లి దండ్రులకు సీబీఐ అధికారులు అవ‌శేషాల‌ను అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా సీబీఐ జ‌డ్జి ముందు త‌ల్లిదండ్రులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అనంత‌రం అయేషా త‌ల్లి మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లు పెట్టుకున్నారు. సీబీఐపై ఎంతో నమ్మకం పెట్టుకున్నామని అన్నారు. కానీ అవినీతికి పాల్పడి ఆధారాలు అన్నీ తారుమారు చేశారని అన్నారు. ఆధారాలు చాలా ఉన్నాయని, కానీ కావాలనే దర్యాప్తు సరిగ్గా చేయలేదన్నారు.

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషయల్ ఎంక్వేరీ చేయాలని సీఎం చంద్రబాబును కోరుతామన్నారు. మైనారిటీలం కాబ‌ట్టే మాకు న్యాయం జ‌ర‌గ‌లేదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీబీఐకి వెళితే హైకోర్టుకు.. హైకోర్టుకు వెళితే సీబీఐకి వెళ్ల‌మంటార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న్యాయం చేయ‌క‌పోగా అన్యాయం చేశార‌న్నారు. త‌మ బిడ్డ శ‌రీర భాగాల‌ను ఇస్తూ స‌త్యాన్ని, న్యాయాన్ని ధ‌ర్మాన్ని స‌మాధి చేస్తున్నార‌ని మండిపడ్డారు. కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నార‌ని, సామాన్యుల‌కు న్యాయం జ‌ర‌గ‌దు అని తేలింద‌న్నారు.

నిర్భ‌య కేసులో నేరస్థులు అంత్యంత పేద‌వాళ్లు కాబ‌ట్టే న్యాయం జ‌రిగింద‌న్నారు. ప్రియాంక రెడ్డి చ‌నిపోయిన త‌ర‌వాత దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చి ఎన్ కౌంట‌ర్ చేశార‌న్నారు. అయేషా మైనారిటీకి చెందిన యువ‌తి కాబ‌ట్టే న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. మైనారిటీలు అంటే చుల‌క‌నగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. డ‌బ్బు ఉన్న‌వాళ్ల‌కే న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. అయేషా కేసులో నేరస్థులు ఎవ‌రో అంద‌రికీ తెలుస‌ని కానీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

Next Story