నగరంలో దారుణం యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-28 07:54:19  IST  )

విజయవాడలో ఓ ఆటోడ్రైవర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నగరంలో దారుణం యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ నగరంలో ఓ ఆటో డ్రైవర్ కామాంధుడిగా మారి ఒక యువతి జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రికి సేవ చేసేందుకు వచ్చిన ఒక యువతిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం రేపింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలి తండ్రి అనారోగ్య కారణాలతో విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (GGH)లో చికిత్స పొందుతున్నారు. తండ్రిని చూసుకునేందుకు సదరు యువతి ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన ఒక ఆటో డ్రైవర్, ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. సహాయం చేస్తానని నమ్మబలికి, ఆమెను తన ఆటోలో ఎక్కించుకుని కృష్ణలంక ప్రాంతంలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణంపై బాధితురాలు మాచవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు జిజిహెచ్ (GGH) ఆస్పత్రి ఆవరణలోని, కృష్ణలంక పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులు రావలసి ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆస్పత్రుల వంటి రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story