మడ అడవులపై దాడి.. మత్స్యకారుడి పోరాటం.. సముద్రతీరానికి ముప్పు!

by Ramesh Naini |

సముద్రతీరం ప్రమాదంలో పడింది. బడా బాబులు తీరాన్ని కబ్జా చేస్తున్నారు. పెదగంజాం పల్లెపాలెం వద్ద మడ అడవులను నాశనం చేస్తున్నారు. ఈ అకృత్యాలపై ఓ మత్స్యకారుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మడ అడవులపై దాడి.. మత్స్యకారుడి పోరాటం.. సముద్రతీరానికి ముప్పు!
X

దిశ, ప్రతినిధి బాపట్ల: సముద్రతీరం ప్రమాదంలో పడింది. బడా బాబులు తీరాన్ని కబ్జా చేస్తున్నారు. అధికారులను ముడుపులతో లోబర్చుకుంటున్నారు. అక్రమంగా రొయ్యల చెరువులు ఏర్పాటు చేస్తున్నారు. పెదగంజాం పల్లెపాలెం వద్ద మడ అడవులను నాశనం చేస్తున్నారు. మురుగు కాలువలను పూర్తిగా తొలగిస్తున్నారు. ఈ అకృత్యాలపై ఓ మత్స్యకారుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై మూడు నెలల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

అసలు విషయం ఏమిటంటే?

పల్లెపాలెం గ్రామంలో 600 కుటుంబాలు చేపల వేట ప్రధాన వృత్తిగా బతుకుతున్నాయి. సముద్రంతో పాటు రొంపేరు కాలువ, పిల్ల కాలువల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నారు. రొంపేరు కాలువ పరివాహక ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు కార్బన్ ను అధికంగా విడుదల చేయడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి, చేపల సంతానోత్పత్తికి, కాలువలు కోతకు గురికాకుండా ఆపడానికి, ప్రకృతి విపత్తులను అదుపు చేయడానికి రక్షణ గోడగా నిలుస్తాయి. ఈ మడ చెట్లు అనేవి మత్స్యకార జీవన సంస్కృతి మనుగడలో కీలక పాత్ర పోషిస్తాయి. రొంపేరు కాలువ సమీపంలో మడ అడవులతో కూడుకున్న ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో బాపట్లకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అధికారుల సహకారంతో ప్రభుత్వ భూముల్లోని మడ అడవులను పూర్తిగా నిర్మూలించి, మురుగు కాలువలను సైతం ధ్వంసం చేశారు. రొయ్యల చెరువులు నిర్మిస్తున్న సమయంలో స్థానికులు అడ్డం తిరిగారు. అప్పట్లో రొయ్యల చెరువుల నిర్మాణం తాత్కాలికంగా నిల్చిపోయింది.

హైకోర్టు ఆదేశాలతో..

కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపడుతున్న రొయ్యల చెరువుల నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయాలని పెద్దగంజాం పల్లెపాలేనికి చెందిన వల్లభుని ఉదయ భాస్కర్ అనే మత్స్యకారుడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉదయ భాస్కర్ ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం తక్షణమే రొయ్యల చెరువుల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Next Story