అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

by Thanuru Gopichand |

తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SV University) ఇటీవల తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతోంది.

అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SV University) ఇటీవల తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలతో సైకాలజీ ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి సస్పెండ్ కాగా.. సంస్కృతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్ట్‌లు జరిగాయి. అవి మరవక ముందే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, తండ ధర్మారంకు చెందిన గుగులోతు సర్దార్ నాయక్ ఎస్వీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసరుగా (Associate Professor) పని చేస్తున్నారు.

గత రెండు రోజులుగా తన నివాసం నుంచి బయటకు రావడం లేదు. అంతేకాకుండా విధులకు కూడా హాజరు కావడం లేదు. దీంతో అసోసియేట్ ప్రొఫెసర్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున అసోసియేట్ ప్రొఫెసర్ మృతదేహాన్ని కొందరు గమనించారు.

సొంత కారులోనే సర్దార్ నాయక్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు. సర్దార్ నాయక్ మరణించి రోజులు గడవడంతో అతని శరీరం కుళ్లిన స్థితికి చేరుకుంది. పోలీసులు అతని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అసోసియేట్ ప్రొఫెసర్ మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత కారు లోపల మృతదేహం ఉండడంతో ఆయనది హత్యా లేక ఆత్మహత్య అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story