టాయిలెట్లు, ఆలయాలు మీ దృష్టిలో ఒక్కటేనా.. షర్మిలకు మంత్రి ఆనం కౌంటర్

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

టాయిలెట్లు, ఆలయాలు మీ దృష్టిలో ఒక్కటేనా.. షర్మిలకు మంత్రి ఆనం కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దళిత వాడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో గుడుల బదులు టాయిలెట్లు నిర్మించాలని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని రుజువు చేసేందుకు ఇదో ఉదాహరణ అని వైఎస్ షర్మిల కామెంట్ చేశారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

హిందూ మతాన్ని దెబ్బ తీసేలా జగన్ పాలన..

ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆనం మాట్లాడుతూ.. షర్మిల అభిప్రాయం ఏదైనా పార్టీ సంబంధించి ఉండోచ్చు కానీ.. పాలకులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. షర్మిల పూజించే మతంపై గౌరవం ఉండొచ్చు.. కానీ, ఇతర మతాలను గౌరవించాల్సి కూడా ఉండాన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని మతాలను గౌరవించే వారని.. ఆలయాలకు వెళ్లి పూజలు చేసే వారని గుర్తు చేశారు. హిందు మతాన్ని దెబ్బతీసే విధంగా ఐదేళ్ల పాటు జగన్ పాలన సాగిందని అన్నారు. అంతర్వేదిలో రథాన్ని కాల్చివేశారని.. నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని మంట కలుపుతూ అనేక అకృత్యాలకు పాల్పడ్డారని, అందుకే ఆ పార్టీకి 11 సీట్లతో ప్రజలు గుణపాఠం చెప్పారని ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్ చేశారు.

నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు..

రాష్ట్రంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు తలెత్తకునే పరిస్థితుల్లో లేవని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. షర్మిల తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటందని హితవు పలికారు. ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్‌లు కట్టాలని సలహాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మీ దృష్టిలో టాయిలెట్లు, ఆలయాలు ఒకటేనా అని ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శించడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అలవాటైపోయిందని అన్నారు. టీటీడీ నిధులతో 5 వేల ఆలయాలు నిర్మిస్తామంటే వైఎస్ షర్మిలకు వచ్చిన నొప్పేంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఆలయాలు నిర్మించాలని సీఎం గారు సూచిస్తే.. ఆయన ఆరెస్సెస్ వాదిలా కన్పిస్తున్నారా అని ప్రశ్నించారు. టీటీడీ అనేది ప్రభుత్వ ఖజానా కాదని.. ఆ సంస్థకు వచ్చే విరాళాలను వినియోగించడానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని తెలిపారు. దళిత వాడల్లో గుళ్లు నిర్మిస్తే ఇతర మతాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన షర్మిలో స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్ చేశారు. సున్నితమైన అంశాల మీద మాట్లాడం వల్ల మతాలు, కులాల మధ్య చిచ్చు రేపేలా షర్మిల ప్రయత్నం చేస్తోందని ఆనం ఆరోపించారు.

మత మార్పిడులు చేయడమే వృత్తిగా పెట్టుకున్న మీకు.. దేవాలయాల నిర్మాణం నచ్చకపోవడమనేది ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. టాయిలెట్ల సలహాను మీరు చర్చికో.. మసీదుకో ఇవ్వగలరా అని షర్మిలను ప్రశ్నించారు. హిందూ మతంపై షర్మిల చేసిన ఆరోపణలు ఆమె సొంత విధానమా లేక కాంగ్రెస్ పార్టీ విధానమో అధినాయకత్వం సమాధానం చెప్పాలని ఆనం అన్నారు.

Next Story