- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త : APSDMA హెచ్చరిక
రాష్ట్రంలో రేపు ఎండలతో పాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపు ఎండలతో పాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆదివారం కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందని పేర్కొన్నారు. అలాగే 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని, పిల్లలు, వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వీలైనంత వరకూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు.
ఈ జిల్లాల్లో పిడుగులు, వర్షాలు
ఛత్తీస్ గఢ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడవద్దని, సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని కోరారు.
అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో శనివారం సాయంత్రం, రాత్రి సమయాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
నేడు (శనివారం) రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. కృష్ణాజిల్లా కానుమోలులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత, అనకాపల్లి మాకవరపాలెంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.






