AP | రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి

by Thanuru Gopichand |

రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వేర్వేరుగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

AP | రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వేర్వేరుగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, పశ్చిమ గోదావరి జల్లాలో జరిగిన ప్రమాదంలో బస్సు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

తణుకు జాతీయ రహదారిపై

పోలీసుల వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పాత టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ యూ టర్న్ తీసుకుంటున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తా కొట్టింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ సిబ్బంది కూడా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అమలాపురం నుంచి విజయవాడ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నారు.

సంతమాగులూరు వద్ద

బాపట్ల జిల్లా పరిధిలోని సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామిరెడ్డిపాలెంకు చెందిన సోమిరెడ్డి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. దీంతో సోమిరెడ్డ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ఆంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి ఆంబులెన్స్ లో నరసరావుపేటలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story