గ్రీన్ ఎనర్జీ దిశగా ఏపీ.. రూ. 22 వేల కోట్లతో భారీ ప్రణాళికలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-29 13:10:03  IST  )

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆ శాఖ అధికారులతో చంద్రబాబు నాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ...

గ్రీన్ ఎనర్జీ దిశగా ఏపీ.. రూ. 22 వేల కోట్లతో భారీ ప్రణాళికలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని(Electricity sector) మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆ శాఖ అధికారులతో చంద్రబాబు నాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన హబ్‌గా మార్చాలని ఈ సందర్భంగా అధికారుకాలకు సూచించారు. ఇందుకు వీలుగా 'గ్రీన్ ఎనర్జీ కారిడార్' ఏర్పాటుపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఏకంగా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించాలని అధికారులకు తెలిపారు. అలాగే 'గ్రీన్ ఎనర్జీ కారిడార్-3' కింద సుమారు రూ. 22,000 కోట్లతో ప్రభుత్వం భారీ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు చెప్పారు. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూనే రాష్ట్రంలో విద్యుత్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుందని అధికారులకు సీఎం చంద్రబాబు వివరించారు.

రాబోయే 6 నెలల యాక్షన్ ప్లాన్

ఇక రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం లేకుండా చూసేందుకు రాబోయే ఆరు నెలల కాలానికి సంబంధించిన కార్యాచరణపై ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర్ (ఇంటింటికీ సౌర విద్యుత్), పీఎం కుసుమ్ (రైతుల కోసం సోలార్ పంపుసెట్లు), పీఎంఈ-డ్రైవ్ వంటి పథకాల పురోగతిపై అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లి, గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా అధికారులు చొరవ చూపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

డిజిటల్ ట్విన్ గ్రిడ్‌తో స్మార్ట్ పవర్..

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు 'డిజిటల్ ట్విన్ గ్రిడ్' నిర్మాణంపై ఈ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్ - NEDCAP)ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఏపీఐఈసీ (APIEC) పాలసీ కింద ఇప్పటికే ఆమోదం పొందిన వివిధ విద్యుత్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన సీఎం, ఆయా పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story