2024 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఏపీ : మంత్రి లోకేష్

by Bhoopathi Nagaiah |

ఏపీలో గూగుల్ కంపెనీ ద్వారా 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేశ్ తెలిపారు.

2024 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఏపీ : మంత్రి లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గూగుల్ కంపెనీ ద్వారా 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేశ్ తెలిపారు. బుధవారం ఆయన అమరావతి ఉండవల్లిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2014-19 వరకు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన హయాంలో ఇండియా లార్జెస్ట్ ఆటోమోటివ్ ఎఫ్‌డీఐ ‘కియా’ తెచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తూ.. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్‌డీఐ ఇన్వెస్టిమెంట్ ఇన్ హిస్టరీగా ఏపీలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోందన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిన విధంగానే.. ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోందన్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఐదేళ్లలో రూ.48 వేల కోట్ల ప్రభావం చూపుతుందన్నారు.

ఇది ఏపీకే కాదు.. దేశానికి విజయం

ఏపీలో గూగుల్ భారీ పెట్టుబడులకు సిద్ధం కావడం ఒక్క ఏపీకే కాక, దేశానికే విజయమని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. దీని కోసం చట్టసవరణల్లో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినపుడు డేటా సెంటర్ స్థలం చూపించానని, అనంతరం నవంబర్‌లో వారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని, ఆ సమయంలో గూగుల్ ప్రతినిధి బృందం ఏపీలో కాకుండా దేశంలోనే కొన్ని చట్టాలను సవరించాలని కోరారని వివరించారు. దీనిపై తాను, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్టవ్, నిర్మలా సీతారామన్‌లను కలిశామన్నారు. అనంతరం ప్రధాని మోదీని గూగుల్ పెట్టుబడిపై రెండుసార్లు కలిసి చర్చించిన తర్వాత చట్టాల్లో అవసరమైన సవరణలు చేశారని చెప్పారు.

ఏపీకి పెట్టుబడుల వెల్లువ

ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కియా మోటారుతో అనంతపురాన్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించామన్నారు. నార్త్ అనంతపురం, కర్నూలులో ఇప్పటికే పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ పెట్టుబడులు వస్తున్నాయని, కర్నూలులో రెండు కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చామని, మరో ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో తమ ప్రభుత్వం వచ్చాక అనేక పెట్టుబడులు తీసుకువచ్చామని, ఎల్జీ(LG) ఎలక్ట్రానిక్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందన్నారు. ఇప్పటికే దేశంలో 50 శాతం ఏపీలు ఏపీలో తయారవుతున్నాయని, డైకిన్, బ్లూస్టార్ విస్తరణ జరిగితే 80 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఆర్సెలర్ మిట్టల్ వారి ఇండియా లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, రహేజా, రహేజా వంటి నిర్మాణ సంస్థలు, మెడికల్ డివైస్, ఫార్మా సంస్థలు వచ్చాయన్నారు.

2024 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఏపీ

అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేసి 2024 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. గ్రేటర్ విశాఖ ఎకనమిక్ కారిడార్‌ను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి, ఇంటిగ్రేటెడ్ ప్రణాళికలు (ఎయిర్ పోర్టు, రైల్వే, రహదారులు) రూపొందిస్తున్నామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెం.1గా నిలబడుతుందన్నారు.

20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం

పెట్టుబడుల కోసం క్రియాశీలకంగా, చురుగ్గా ముందుకెళ్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. దావూస్ పర్యటన అనంతరం టాప్ -10 ఇన్వెస్టర్స్ లిస్ట్ తన బ్యాగులోనే ఉంటోందన్నారు. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామని, ఈ లక్ష్యసాధనకు అహర్నిశలు కష్టపడుతున్నామని పేర్కొన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చాలెంజ్‌గా తీసుకున్నామన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానాలిచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేశామన్నారు. తాము టీసీఎస్, కాగ్నిజెంట్‌లకు మాత్రమే ఎకరా రూపాయికి భూములిచ్చామని, ఇంకెవరికైనా ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కౌన్సిల్‌లో చాలెంజ్ చేశానని గుర్తుచేశారు. ఆ రెండు సంస్థలు 25 వేల ఉద్యోగాలు కల్పిస్తాయని, వాటివల్ల 15 వేల కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు సాగుతాయన్నారు. నవంబర్‌లో మరికొన్ని కీలక ఎనౌన్స్‌మెంట్లు ఉంటాయని వివరించారు. జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రూ.700 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదని విమర్శించారు. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామన్నారు.

ఈ నెల 18 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా వెళ్తున్నాం

రాష్ట్రంలోని యువతలో ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు గూగుల్‌తోపాటు టీసీఎస్, కాగ్నిజెంట్‌తో కలసి పనిచేయాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించామని మంత్రి లోకేశ్ తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇందుకు కృషి చేస్తోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 125 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కమిట్‌మెంట్స్ వచ్చాయని, కొత్త పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామని, ఈనెల 18 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో సిఫీ సంస్థ 500 మెగావాట్ల డాటా సెంటర్‌కు భూమిపూజ చేసిందని, రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో 6 గిగావాట్ల డేటా సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తిచేసి పేద విద్యార్థులకు మేలు చేసేందుకు పీపీపీ విధానాన్ని తెచ్చామని, తాము ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదని, కేవలం పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు.

Next Story