AP | సానుకూల దృక్పథంతో రైతుల సమస్యలకు పరిష్కారం

by Thanuru Gopichand |

అమరావతి రైతుల (Amaravathi Farmers) సమస్యలకు సానుకూల దృక్పథంతో పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు (CRDA Commissioner Kanna Babu) హామీనిచ్చారు.

AP | సానుకూల దృక్పథంతో రైతుల సమస్యలకు పరిష్కారం
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి రైతుల (Amaravathi Farmers) సమస్యలకు సానుకూల దృక్పథంతో పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు (CRDA Commissioner Kanna Babu) హామీనిచ్చారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అర్బన్ డిజైన్ అర్కిటెక్చరల్ మార్గదర్శకాలపై రైతు ప్రతినిధులకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అవగాహన సమావేశం (Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతో రాజధానిని అభివృద్ధి చేయాలని కోరారు. సీఆర్డీఏ యంత్రాంగం జవాబుదారీతనంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న కొన్ని విషయాలపై అభ్యంతరాలతో పాటు వివిధ సమస్యలపై భూములిచ్చిన రైతులు సీఆర్డీఏ ముందు గట్టిగా వాదనలు వినిపించారు.

సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ రైతులతో ప్రతి నెలా మూడో శనివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. తద్వారా సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. సీఆర్డీఏ అధికారులకు, రైతులకు మధ్య సమాచారం లోపం ఉందని గుర్తించామన్నారు. ఆ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. రైతులు తెలిపిన గ్రామ కంఠాలు, జరీబు భూములు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన భూ వ్యవహారాలు చూసిన అధికారి వల్లే సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. రైతు జేఏసీ ఇచ్చిన 14 సమస్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావించి వాటి పరిష్కారం ఏ దశలో ఉందో రైతులకు వివరించారు. అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోగలిగే అంశాలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. రైతులతో కొందరు అధికారులు సరైన రీతిగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు అందాయన్నారు. అటువంటి అధికారులను పిలిచి మాట్లాడతామని రైతులకు హామీనిచ్చారు.

Next Story