ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ : మంత్రి దుర్గేష్

by Thanuru Gopichand |

ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల నిలబెడుతామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ : మంత్రి దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సుస్థిర పర్యాటక రంగ వృద్ధి, డిజిటలైజేషన్ (Digitalization) చేయడం, ఇన్ బౌండ్ టూరిజంను మెరుగుపరిచే ఉద్దేశంతో నవంబరు 4 నుంచి 6 వరకు లండన్ లో పర్యటించనున్నామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 సమావేశంలో పాల్గొంటామన్నారు. పర్యటనలో భాగంగా లండన్ లో 30 మంది ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించనున్నామని పేర్కొన్నారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (World Travel Market) వేదికగా ఏపీ స్టాల్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అద్భుతమైన సహజ సిద్ధ ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిపేలా ప్రచారం చేస్తామన్నారు. అక్కడికి వచ్చే ప్రతినిధులకు కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికి, అరకు కాఫీని (Araku Coffee), ఆంధ్రా ఫేమస్ పూతరేకుల రుచి చూపించడంతో పాటు జీఐ ట్యాగ్ పొందిన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను బహుమతిగా అందించనున్నామని వివరించారు. అంతేగాక ఏపీ బృందంతో పాటు ప్రఖ్యాత స్టేక్ హోల్డర్స్ ను, ట్రావెల్ ఆపరేటర్లను తీసుకెళ్లనున్నామని తెలిపారు.

ఏపీ పర్యాటక రంగాన్ని విశ్వవ్యాప్తం చేయడం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ (Minister Durgesh) అన్నారు. తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల, పలు దేశాల పర్యాటక బోర్డులు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, గ్లోబల్ హాస్పిటాలిటీ బ్రాండ్లు, టూర్ ఆపరేటర్లు, డెస్టినేషన్ మేనేజ్ మెంట్ కంపెనీలు తదితర ఇన్వెస్టర్లను ఒకచోట చేర్చే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రదర్శన ద్వారా ఏపీ పర్యాటక వాణిని వినిపించి వినూత్న పెట్టుబడులు (Investments) ఆకర్షిస్తామని మంత్రి దుర్గేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ ను వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025లో పాల్గొనేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నవంబర్ 2వ తేదీన లండన్ పర్యటనకు బయలుదేరనున్నారు.

Next Story