AP News : పర్యాటక రంగానికి మహర్ధశ : మంత్రి కందుల దుర్గేష్

by Muthe.Rajitha |

ఏపీ పర్యాటాకాభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అభ్యర్థనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekavath) సానుకూలంగా స్పందించారు.

AP News : పర్యాటక రంగానికి మహర్ధశ : మంత్రి కందుల దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ పర్యాటాకాభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అభ్యర్థనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekavath) సానుకూలంగా స్పందించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కాట వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్వదేశీ దర్శన్(Swadeshi Darshan) క్రింద అభివృద్ధి చేయదలచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించమన్న మంత్రి దుర్గేష్ అభ్యర్థనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించి మరో వారం పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్రమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్ ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ కేంద్రమంత్రికి వెల్లడించారు. ప్రధానంగా విశాఖపట్టణం జిల్లా సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయని, కాకినాడ జిల్లా అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోనున్నాయని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే బిడ్ వేశామన్నారు. శాస్కి స్కీమ్ క్రింద చేపడుతోన్న గండికోట ఫోర్ట్ కు సంబంధించిన టెండర్లు ఇప్పటికే స్వీకరించామన్నారు. పర్యాటకులకు సాహసోపేతమైన అనుభవాలను కల్పించేందుకు సర్వత్రా సిద్ధమవుతోందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని త్వరలోనే పట్టాలెక్కుతుందని వెల్లడించారు. అందులో భాగంగా పుష్కర్ ఘాట్, హేవలాక్ వంతెనల ఆధునికీకరణ చేపట్టనున్నామన్నారు.

ప్రసాద్ స్కీం క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలుపుతూ ఇప్పటికే మంజూరైన రూ. 54.04 కోట్ల నిధుల్లో తొలి విడతగా రూ.13.69 కోట్లు వినియోగించామని, మిగిలిన 2,3వ విడత నిధులు త్వరతగతిన మంజూరు చేస్తే మరో 5 నెలల్లో పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రికి మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గతేడాది 19 సెప్టెంబర్ న నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని వాటిని కూడా పరిశీలించి ఆమోదించాలని మంత్రి దుర్గేష్ కోరారు. అదే విధంగా మంగళగిరి, అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదలను కూడా వీలైనంత త్వరగా ఆమోదిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే పర్యాటక ప్రాంతాలు నూతన శోభను సంతరించుకొంటాయన్నారు. తద్వారా పర్యాటకుడికి ఆహ్లాదం, యువతకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతాయని ఈ సందర్భంగా టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట అన్నారు.

Next Story