10 సెకన్లలోనే మండలి వాయిదా.. మార్చి 4 వరకు సభ నిలిపివేత

by Ramesh Naini |

సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడగా, తిరిగి ప్రారంభమైన తర్వాత కేవలం పది సెకన్ల వ్యవధిలోనే చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

10 సెకన్లలోనే మండలి వాయిదా.. మార్చి 4 వరకు సభ నిలిపివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడగా, తిరిగి ప్రారంభమైన తర్వాత కేవలం పది సెకన్ల వ్యవధిలోనే చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను వచ్చే బుధవారానికి (మార్చి 4) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

ఘర్షణకు దారి తీసిన అంశాలు..

నేడు ఉదయం సభ ప్రారంభం కాగానే, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీనికి నిరసనగా వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. మరోవైపు, తిరుమల లడ్డూ ప్రసాదంపై నిన్న జరిగిన లఘు చర్చలో భాగంగా సభకు సమర్పించిన పత్రాల్లో ఒకటి తప్పుగా ఉందని చైర్మన్ ప్రకటించడం వివాదానికి దారితీసింది. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘చైర్మన్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. తిరుమల నెయ్యి అంశంపై ప్రభుత్వం తరఫున ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.

పది సెకన్ల డ్రామా..

అంతకుముందు జరిగిన గందరగోళంతో సభను కాసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమవుతుందని సిబ్బంది బెల్ కొట్టగానే, చైర్మన్ మోషేన్ రాజు తన స్థానంలోకి వచ్చి, ఎటువంటి చర్చకు అవకాశం ఇవ్వకుండానే ‘సభను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నాను’ అని ప్రకటించి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. చైర్మన్ తీరుపై టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ వాయిదా పడినప్పటికీ తమ స్థానాల్లోనే కూర్చుని నిరసన తెలిపారు. తిరుమల లడ్డూ అంశంపై రూల్ 307 కింద స్టేట్‌మెంట్ ఇవ్వడానికి తాము ఇప్పటికే నోటీసు ఇచ్చామని, చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కాగా, మండలి తిరిగి వచ్చే బుధవారం ఉదయం ప్రారంభం కానుంది.

Next Story