- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | నిధులివ్వడానికి నేనేం సీఎంను కాదు.. డిప్యూటీ సీఎం మాత్రమే
నిధులివ్వడానికి తాను సీఎం కాదని.. డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : నిధులివ్వడానికి తాను సీఎం కాదని.. డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను బుధవారం పరిశీలించారు. అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్ ల డెవలప్మెంట్ కోసం సుమారు 4000ల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్థికపరమైన అంశాలన్నీ సీఎం చంద్రబాబు నాయుడు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి నిధుల విషయం తనను కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరి నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందని ఆరోపించారు. కానీ డెవలప్మెంట్ పనులకు కేటాయించలేదన్నారు. శంకరగుప్తంలో అయితే ఇంచ్ పూడిక కూడా తీయలేదన్నారు. తమ ప్రభుత్వంపై సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ బాధ్యత కూడా ఉందన్నారు. కానీ దానికి నిధులు సమకూర్చడానికి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ కూడా గత ప్రభుత్వంలో అమలు చేయలేదన్నారు. కనీసం జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. తాము కేవలం ప్రతిపాదనలు చేస్తామని.. సీఎం నిధులు విడుదల చేస్తారని స్పష్టం చేశారు.
తాను ఇక్కడకు సరదాకు రాలేదన్నారు. ఇక్కడ లక్ష కుటుంబాలకు కొబ్బరితోటలపై ఆధారపడి జీవిస్తున్న విషయం తనకు తెలుసన్నారు. కలెక్టరుతో కూడా ఈ విషయమై చర్చించామన్నారు. సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళిక కావలసిన అవసరం ఉందన్నారు. సమస్యకు మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం చూపించలేమన్నారు. తానేదో ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక 20 కోట్లు ఇచ్చేసి, చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోవడానికి చూడట్లేదన్నారు. ఇది జేబులో నుంచి తీసిచ్చే విషయం కాదని. ఓట్లు వేస్తారని కూడా కాదని.. గెలిచినా ఓడినా సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రాజ్యాంగం జీవించే హక్కును ఇచ్చిందన్నారు. మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలని. అందుకు అడ్డంకులు ఏంటి.. అందులో స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? మనం గ్రూప్ గా ఏమైనా చేశామా. ఇవన్నీ కూర్చొనిచూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
కలెక్టరుతో మాట్లాడుతున్నప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టోటల్ డ్రైన్స్ కు 4వేల కోట్లు అవుతాయని అంచనా ఉందన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినా, అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినా.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. లక్ష ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నప్పటికీ కోకోనట్ బోర్డు లేదన్నారు. దాని గురించి నేను క్యాబినెట్లో మాట్లాడతానని హామీనిచ్చారు. శంకరగుప్తంలో వస్తున్న సమస్య మ్యాన్ మేడ్ అని తన వద్ద రిపోర్ట్ ఉందన్నారు. దీనిపై రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోషయ్య ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ రిపోర్టు గురించి అధికారులకు తెలియకపోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
మీరు ఇంత కష్టపడేది మీ బిడ్డలకోసమేనని తనకు తెలుసన్నారు. ఇక్కడున్న రైతుల బిడ్డలు ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ల వయస్కులే ఉండి ఉండొచ్చని తెలిపారు. వారికి మంచి భవిష్యత్తు అందించడం కోసం మీరు పడే తపనే నేను పడుతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. మీ ఆదాయమార్గం, మీ వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు అవరోధాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నానని ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో మరోసారి డ్రైన్ అంశాలే కాకుండా ఆక్వా పొల్యూషన్ వంటివి కూడా చర్చిస్తామన్నారు. తనకు ఇతర జిల్లాలు కూడా సమానమేనన్నారు. కాకపోతే కోనసీమపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం అన్నారు. తనకు సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించేందుకు 40 రోజుల సమయం ఇవ్వాలని కోరారు.






