ఐపీఎస్‌ సునీల్‌నాయక్ బెయిల్‌ పిటిషన్‌.. కోర్టు కీలక ఆదేశం

by Naga Rani Yarlagadda |

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు భయంతో ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు అప్పీల్ చేశారు.

ఐపీఎస్‌ సునీల్‌నాయక్ బెయిల్‌ పిటిషన్‌.. కోర్టు కీలక ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ (Raghurama Custodial Torture) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్ (IPS Sunil Naik) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) కీలక విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు సునీల్‌నాయక్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారి (Investigating Officer) ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది.

2021లో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును సిఐడి (CID) పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయనపై భౌతిక దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదైన కేసులో సునీల్‌నాయక్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు భయం ఉండటంతో, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్‌నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఉభయ పక్షాల వాదనల అనంతరం, పూర్తి వివరాలను పరిశీలించేందుకు వీలుగా విచారణను వచ్చే నెల 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఇతర పోలీస్ అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. సునీల్‌నాయక్ విచారణకు హాజరయ్యే తీరును బట్టి తదుపరి ఆదేశాలు ఉండే అవకాశం ఉంది.

Next Story