పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వ నూతన సంవత్సర కానుక

by Thanuru Gopichand |

ఏపీ ప్రభుత్వం పింఛన్ దారులకు నూతన సంవత్సర కానుకను అందజేస్తోంది.

పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వ నూతన సంవత్సర కానుక
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం (AP Government) పింఛన్ దారులకు నూతన సంవత్సర కానుకను (New Year) అందిస్తోంది. జనవరి 1వ తేదీన అందించాల్సిన ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పింఛన్ ను డిసెంబర్ 31న ఒక రోజు ముందుగానే అందిస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ నిర్ణయంతో మరో మైలురాయిని దాటింది.

సంక్షేమానికి పెద్దపీట

కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా పింఛన్ దారులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పిస్తోంది. నూతన సంవత్సరం నేపథ్యంలో లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పింఛన్లను అందజేస్తోంది. సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారికి నేడు పింఛన్లను పంపిణీ చేయనుంది. వారంతా ఆనందంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రూ.2,743 కోట్ల విడుదల

​రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భారీగా రూ. 2,743 కోట్ల నిధులను విడుదల చేసింది. ముఖ్యంగా గతంతో పోలిస్తే పింఛన్ మొత్తాన్ని రూ. 4,000 కు పెంచడం, అది కూడా ప్రతి నెలా నిర్ణీత సమయంలోనే అందించడం ద్వారా పేదల ఆర్థిక భరోసాకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఒక్కరోజు ముందుగానే నగదు విడుదల చేయడమే కాకుండా.. బ్యాంకులతో సమన్వయం చేసుకుని సచివాలయ సిబ్బందికి నిధులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రభుత్వం తన కార్యదక్షతను, ప్రజా సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది.

​నేడు ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి ముంగిటనే పింఛన్ సొమ్మును అందజేయనున్నారు. సాంకేతికత సహకారంతో జియో ట్యాగింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ముందస్తు పంపిణీతో పింఛనుదారులు సంబరాల్లో మునిగిపోతూ, తమకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Next Story