కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ..?

by Malleboina Mahesh |

కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.

కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ..?
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కేంద్ర జలశక్తి శాఖకు తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 16 కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్ 16న జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ జలవనరుల శాఖ (AP Water Resources Department), ఈ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు లేవని తమ లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొత్తం 42 కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని, ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో వెల్లడించింది.

కేంద్ర జలసంఘం (CWC), అపెక్స్ కౌన్సిల్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం జరగకుండా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఏపీ కోరినట్లు తెలుస్తోంది.. తెలంగాణ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుందని, కాబట్టి ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయకూడదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతుండగా కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందనే విషయంపై అధికారికి ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఒక వేళ ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం నిజమైతే.. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనని చర్చించుకుంటున్నారు.

Next Story